13-01-2026 02:20:49 AM
ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ర్టంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను క్లియర్ చేస్తారని ఆశగా ఎదురుచూస్తుంటే.. ప్రభుత్వం కేవలం ఒక్క డీఏనే ప్రకటించి చేతులు దులుపుకున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు తీరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని బాధపడ్డారు. ప్రభుత్వం సోమవారం ఒక డీఏను విడుదల చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఆయన స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ర్ట ప్రభుత్వం మిగిలిన డీఏల ఊసే ఎత్తకపోవడం, ముఖ్యంగా పీఆర్సీ మంజూరుపై సీఎం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం దురదృష్టకరమని చెప్పారు.
ప్రభుత్వం వెంటనే పీఆర్సీని మంజూరు చేయాలని, పెండింగ్ డీఏలన్నింటినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఒక డీఏ ఇచ్చినా, రేపోమాపో కేంద్రం జనవరి నెలకు గానూ కొత్త డీఏ ప్రకటిస్తుందని, దీంతో పెండింగ్ డీఏల సంఖ్య మళ్లీ ఐదుకు చేరుతుందని ఆయన తెలిపారు. ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇస్తామనడం మంచిదే అయినా.. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్‌మెంట్, రిటైర్‌మెంట్ బెనిఫిట్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.