06-05-2025 08:52:01 PM
ధాన్యం తరలింపు కోసం నానా పాట్లు పడుతున్న అధికారులు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి అధికారులు నానా పాట్లు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) వ్యాప్తంగా యాసంగిలో సాగుచేసిన వరి పంట దిగుబడులను ఖరీదు చేయడానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం ఇప్పుడు అధికారులకు సవాల్ గా మారింది.
అకాల వర్షాలు కురుస్తుండడంతో కాంటాలు పెట్టి ఎగుమతికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడుస్తుండడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్ల పరిస్థితి ఉండడంతో ఉన్నతాధికారులు కాంటా పెట్టిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో మండల స్థాయి అధికారులు లారీల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ ఖాళీ లారీ దొరికితే అక్కడ ఆపి వెంటనే దగ్గరలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి పంపి లారీల్లోకి ధాన్యాన్ని లోడ్ చేయిస్తున్నారు.
సివిల్ సప్లై డిఎం కృష్ణవేణి, రవాణా శాఖ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాయి చరణ్, వివిధ మండలాల తహసిల్దార్లు ఎర్రయ్య, సైదులు, ఎస్ఐలు మురళీధర్ రాజ్, సతీష్ కేసముద్రం, మరిపెడ మండలాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇదే విధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుండి సరుకులు తెచ్చే లారీలను అన్లోడ్ చేయగానే పట్టుకొని వెంటనే ధాన్యం రవాణా కోసం తరలిస్తున్నారు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు అక్కడక్కడ కురుస్తుండడంతో ధాన్యం కాంటా పూర్తి అయిన కేంద్రాల్లో ధాన్యం బస్తాలు నిలువ ఉంచకుండా అధికారులు రేయింబవళ్లు కష్టపడుతూ చర్యలు తీసుకుంటున్నారు.