06-05-2025 09:00:17 PM
నిర్మల్: మోటార్ సైకిల్ పై వెళ్తున్న దంపతులను అడ్డగించి, బాదితుని మెడలోని బంగారు చైన్ ను, బాదిత మహిళ మెడలోంచి బంగారు పుస్తెలతాడు అపహరించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న ఘటన మంగళవారం నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీ అవినాష్ కుమార్ IPS బైంసా ASP విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపిన వివరాల ప్రకారం... గత నెల ఏప్రిల్ 30వ తేదీన రాత్రి ఇద్దరు దంపతులు మోటార్ సైకిల్ పై నిర్మల్ నుంచి వెంగ్వాపేటకు వెళ్తున్న క్రమంలో కావేరి కుటీర్ వద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వారి మోటార్ సైకిల్ ను అడ్డగించి, బాదితుని మెడలోని బంగారు చైన్ ను, బాదిత మహిళ మెడలోంచి బంగారు పుస్తెలతాడు అపహరించి, వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై పరారయ్యారు.
దీంతో బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నిర్మల్ రూరల్ పోలీసులు చైన్ స్నాచింగ్ దొంగల కోసం విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంజులాపూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా వచ్చుచున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి పోలీసులని చూసి పారి పోయే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు పట్టుకొని విచారించగా వారు, నాందేడ్ జిల్లా సోనారి తాలూకా, పొన్నాలకు చెందిన పర్బాజీ బాలాజీ రేల్వాడ్(29), తల్వేద గ్రామానికి చెందిన అలిశెట్టి శ్రీనివాస్(39) అని తెలిసింది.
పూర్తి విచారణలో ఫిర్యాది మెడలోని బంగారు చైన్ ఇంకా మహిళ మెడలోంచి బంగారు పుస్తెలతాడు చోరీ చేసింది తామేనని నిందితులిద్దరూ అంగీకరించారు. వారి వద్ద నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు, ఒక తులం బంగారు గొలుసును స్వాధీనం చేసుకొన్నారు, ఆ ఇద్దరినీ రిమాండ్ కు తరలిచడం జరుగుతుందని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ సంతోష్, సత్యనారాయణ లను నిర్మల్ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనల గురించి తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని నిర్మల్ పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో నిర్మల్ రూరల్ CI శ్రీ మున్నూరు కృష్ణ, నిర్మల్ రూరల్ SI లింబద్రి, సిబ్బందిలు పాల్గొన్నారు. ఈ కేసులో త్వరగా స్పందించి నిందితుల్ని పట్టుకోవటంలో ప్రతిభ చూపిన రూరల్ CI శ్రీ మున్నూరు కృష్ణ, నిర్మల్ రూరల్ SI లింబద్రి, సిబ్బందినీ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ అభినందించారు.