15-08-2025 12:53:14 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
ఖానాపూర్, ఆగస్టు 14:భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండితే అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. గురువారం సాయంత్రం కడెం ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, రాబోవు రోజుల్లో అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ప్రాజెక్టు అధికారులు భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రాజెక్టు మట్టాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మేరకు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలని సూచించారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం, ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు, ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న నీరు, దిగువకు వదులుతున్న నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని గేట్లను ఎత్తవలసిన పరిస్థితి ఏర్పడినట్లయితే, ప్రాజెక్టు దిగువన ఉన్న అన్ని గ్రామాలను అప్రమత్తం చేయాలన్నారు.
ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో భారీ వర్షాలపై టామ్ టామ్ చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. గేట్లను ఎత్తే ముందు ప్రజలకు తెలిసేలా పరిచేలా సైరన్ మోగించాలని సూచించారు. తప్పకుండా పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. ప్రాజెక్టు సమీపంలోకి ప్రజలను, చేపలు పట్టే వారిని, రైతులను, పశుకాపరులను, సందర్శకులను, అనుమతించవద్దని అన్నారు.
రాత్రి, పగలు అన్నివేళల అధికారులు, సిబ్బంది షిఫ్టులవారీగా ప్రాజెక్ట్ వద్ద ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలలో అలుగులు పారే ప్రదేశాలలో పోలీసు సిబ్బంది గస్తి కాయాలని అన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికా రులు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉన్నారని, విపత్కర పరిస్థితులు ఎదురైతే ఎన్డిఆర్‌ఎఫ్ బృందం జిల్లాలో సిద్ధంగా ఉందని తెలిపారు.
అనంతరం ప్రాజెక్టు పవర్ హౌస్ లో ఏర్పాటు చేసిన స్క్రీన్ లో ప్రాజెక్టు పై అమర్చిన కెమెరాల ద్వారా ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా గమనించారు. ప్రతిక్షణం ఈ కెమెరాల ద్వారా ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలోనికి ప్రజలు ఎవరైనా వస్తున్నారేమో గమనిస్తూ వారిని అప్రమత్తం చేయా లన్నారు. కడెం ప్రాజెక్టు సందర్శనలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, తహసిల్దార్ ప్రభాకర్, డిఎఫ్‌ఓ నాగిని భాను, ఎస్‌ఈ వెంకట రాజేంద్రప్రసాద్, ఈఈ విటల్, డిఈఈ లు నవీన్, వీరన్న, కె.గనేష్ ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.