15-08-2025 01:53:15 AM
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో భారీ మోసం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (విజయక్రాంతి): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న నానక్‌రామ్‌గూడలో 2019లో అత్యంత ఆర్భాటంగా సాస్ ఇన్‌ఫ్రా ఐ టవర్స్ ప్రాజెక్టు మొదలైంది. 37 అంతస్తులతో, 171 మీటర్ల ఎత్తుతో అత్యాధునిక ఆఫీస్ స్పేస్‌లు, రిటైల్ మాల్, సర్వీస్డ్ అపార్ట్‌మెంట్లతో ఒక ‘వర్టికల్ సిటీ’ని నిర్మించాలని ఎస్‌ఏఎస్ ఇన్‌ఫ్రా సంస్థ కలలు కన్నది. కానీ ఆ కలలు కల్లలయ్యాయి.
2022 నుంచి భూ యజమాని, మాజీ ఐఏఎస్ ఆర్‌పీ సింగ్‌తో బిల్డర్ జీవీ రావుకు మొదలైన చిన్నపాటి విభేదాలు పెను తుఫానుగా మారాయి. ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం, పెరిగిన నిర్మాణ వ్యయాన్ని కప్పిపుచ్చుకోవడానికే బిల్డర్ తనపై, తన కుటుంబంపై కుట్ర పన్నుతున్నారని సింగ్ ఆరోపిస్తుండగా, అసలు మోసానికి కారకుడు సింగేనని బిల్డర్ వర్గం ప్రత్యారోపణలు చేస్తోంది. ఈ గందరగోళంలో 2023 నవంబర్ నుంచి హామీ ఇచ్చిన నెలవారీ అద్దెలు కూడా ఆగిపోవడంతో ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
అగ్గిరాజేసిన ‘గిఫ్ట్ డీడ్’
ఈ మొత్తం వివాదానికి అగ్గిరాజేసింది ఒక ‘గిఫ్ట్ డీడ్’. మాజీ ఐఏఎస్ అయిన ఆర్‌పీ సింగ్ 2018లో తన కుమార్తె చేతన్ కౌర్‌కు భూమిని గిఫ్ట్‌గా రిజిస్టర్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆమె మరణించడంతో, హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆ డీడ్ చెల్లకుండా పోయి, భూమిపై సర్వ హక్కులు తిరిగి తండ్రికే సంక్రమించాయి. ఈక్రమంలో ఆ భూమిలో ఐ టవర్స్‌ను నిర్మించడానికి భూ యజమాని ఆర్‌పీ సింగ్, బిల్డర్ జీవీ రావు మధ్య ఒప్పం దం జరిగింది.
అనంతరం ప్రాజెక్ట్ పనులు మొదలయ్యాయి. అయితే గిఫ్డ్ డీడ్ విషయాన్ని సింగ్ తమకు తెలియకుండా దాచిపెట్టారని, దీనివల్ల బ్యాంకు రుణం తిరస్కరణకు గురైందని ఆరోపిస్తూ భూ యజమాని సింగ్‌పై బిల్డర్ జీవీ రావు క్రిమినల్ కేసు దాఖలు చేశారు. దీనిపై సింగ్ తీవ్రంగా స్పందించారు. ‘ నా కుమార్తెకు భూమి గిఫ్ట్ ఇచ్చిన విషయం వారికి తెలుసు.
నిజానికి ఆ రిజిస్ట్రేషన్ జరిగింది బిల్డర్ సమక్షంలోనే. నా కూతురు చనిపోతే అంత్యక్రియ లకు వచ్చి కన్నీళ్లు పెటారు. ఆ బిల్డరేనా ఈ దారుణానికి ఒడిగట్టింది? తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నా కుటుంబంపై బుర ద చల్లుతున్నారు ’ అని సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం కోర్టు మెట్లు ఎక్కింది.
కోట్లు సమీకరణ
తెలంగాణ రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలను బిల్డర్ యథేచ్ఛగా ఉల్లంఘించారని సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు రాకముందే, దాదాపు 6.50 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను అమ్మకానికి పెట్టి, వందల కోట్ల రూపాయలను కొనుగోలుదారుల నుంచి సమీకరించారని ఆరోపించారు. ‘ అగ్రిమెంట్లలో తప్పుడు చిరునామాలు నమోదు చేశారు.
రెరా చట్టం ప్రకారం, కొనుగోలుదారుల నుంచి సేకరించిన డబ్బులో 70% ప్రాజెక్టు కోసమే కేటాయించిన ఎస్క్రో ఖాతాలో ఉంచాలి. కానీ, ఆ నిధులను ఇతర వ్యాపారాలకు, సొంత లాభాలకు మళ్లించారు. ఇది రెరాను, చట్టాన్ని అపహాస్యం చేయడమే ’ అని సింగ్ ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు.
పోర్జరీ ఆరోపణలు
ఈ వివాదంలో అత్యంత తీవ్రమైనవి పో ర్జరీ ఆరోపణలు. తమ సంతకాలను పోర్జరీ చేసి, ఒక నకిలీ వకాలత్ నామాను సృష్టించి, తమపైనే కేసులు వేశారని సింగ్ ఆరోపించడం సంచలనం రేపుతోంది. ప్రాజెక్టులో తనకు రావలసిన భూమి వాటా ఇవ్వకుం డా, తననే బ్లాక్‌మెయిల్ చేసేందుకే ఈ క్రిమినల్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
2022లో ఒక నకిలీ లీగల్ నోటీసును నా పేరుతో సృష్టించి, ఉద్దేశపూర్వకంగా తప్పు డు చిరునామాకు పంపి, అది నాకు అందినట్టుగా కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయ త్నం చేశారని సింగ్ వెల్లడించారు. అంతేకాకుండా బినామీల ద్వారా ఇతర కొనుగోలు దారులను రెచ్చగొట్టి, తనపై వ్యతిరేకత సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలి
ఈ కుంభకోణం కేవలం కొందరి ఇన్వెస్టర్ల సమస్య కాదని, అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగ ప్రతిష్టకు మాయని మచ్చ అని అన్నారు. ఈ కేసును నీరుగార్చకుండా, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని బాధితులు కోరుతున్నారు. ఈ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. అసలు దోషులను చట్టం ముందు నిలబెట్టాలని, లేదంటే భవిష్యత్తులో హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వస్తుందని బాధితులు హెచ్చరిస్తున్నారు.
మౌనం వీడని బిల్డర్
తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, బిల్డర్ జీవీ రావు మాత్రం మౌనం వీడటం లేదు. వివరణ కోరేందుకు బాధితులతో కలిసి విజయక్రాంతి ప్రతినిధి సాస్ కార్పొరేట్ కార్యాలయానికి వెళ్లగా, సెక్యూరిటీ సిబ్బంది వారిని గేటు వద్దే నిలువరించారు. అపాయింట్‌మెంట్ లేదని, యజమాని అందుబాటులో లేరంటూ లోపలికి అనుమతించలేదు. ఈ వైఖరి బిల్డర్ వర్గంపై మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. తమ కష్టార్జితం, తమ పిల్లల భవిష్యత్తు అంతా ఈ ప్రాజెక్టులోనే పెట్టామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు అద్దెలు రావు, ఫ్లాట్ తమదో కాదో తెలియదు. ఎవరికి చెప్పుకోవాలి తమ గోడు’ అంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు.