15-08-2025 01:40:23 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 14 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణకు... హరితహారం పేరుతో ప్రతి ఏటా రు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న, క్షేత్రస్థాయిలో అధికారుల అవగాహన రాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రతి మండలంలో హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్న అధికారులు విద్యుత్ తీగల కింద మొక్కలు నాటి లెక్కలు చెబుతున్నారు. ఏడాది కాగానే మొక్కలు పెరిగి కొమ్మలు విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పెరిగిన మొక్కలను అడ్డంగా నరికేస్తున్నారు.
అదే ప్రాంతంలో మళ్లీ మొక్కలు నాటి కొత్త లెక్కలు ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నారు. దీంతో లక్షలు మొక్కలు పెంచుతున్నట్టు జిల్లా నుంచి రాష్ట్ర అధికారులకు నివేదికల సమర్పిస్తు న్నారు. పరిరక్షించడంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. లక్షల్లో పెట్టిన మొక్కలు వేళల్లోనూ కనిపించకపోవడం గమనార్హం.
అడపా దడపా పెరిగిన విద్యుత్ తీగలకు తగులుతున్నాయని నరికి వేస్తున్నారు. హరితహారంలో భాగంగా బూర్గంపాడు మండలంలోని రోడ్డుకిరు వైపుల మొక్కలు నాటాలని ఆదేశాలు రావడంతో ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పినపాక పట్టి నగర్, మోరంపల్లి బంజర గ్రామాల్లో ప్రధాన రోడ్డుకు ఇరుపక్కల నాటినా.. మొక్కలు పెద్దవి కావడంతో అవి కరెంటు తీగలకు తగిలి తరచుగా విద్యుత్ అంతరాయం కలుగుతోంది.
దీంతో విద్యుత్ శాఖ సిబ్బంది ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేస్తున్నారు. గతంలో కూలీల చేత నాటిన మొక్కలను విద్యుత్ తీగల కింద నాటడం వల్లే వాటిని తరచుగా నరకవలసి వస్తుందని విద్యుత్ సిబ్బంది పేర్కొంటున్నారు. ముందుగానే కరెంటు తీగల కింద మొక్కలు నాటకుండా కొద్ది దూరంలో నాటితే నరికివేత ఉండేది కాదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
జాతీయ రహదారి కి ఇరువైపులా పాల్వంచ నుంచి కొత్తగూడెం వైపు వెళ్లే ప్రధాన రహదారి కి ఇరువైపులా నాటిన మొక్కలను నిర్ధాక్షణంగా విద్యుత్ తీగల పేరుతో నరికి వేస్తున్నారు. దీంతో పర్యావరణ ప్రేమికులు అధికారుల అనాలోచిత విధానంపై మండిపడుతు న్నారు. మొక్కలు నాటే సమయంలోనే తగిన జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి దుస్థితి ఉత్పన్నమయ్యేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇలా అయితే పర్యావరణ పరిరక్షణ ఇంకా పదేళ్లయిన ఆశించిన ఫలితం ఇవ్వదు అనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా జిల్లా అధికారులు మొక్కలు నాటే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.