15-08-2025 01:49:11 AM
హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తివేత
వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు హిమాయత్‌సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. గురువారం అధికారులు 9 గేట్లను ఎత్తి నీటిని వదలడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వలిగొండ, నల్లగొండ, కోదాడ, నకిరేకల్‌లో మూసీ ఉధృతంగా ప్రవహించింది.
దీంతో పలు చోట్ల ప్రధాన రహదారులను మూసివేశారు. ఉస్మాన్ సాగర్ జలాశయంలోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అలాగే నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం జలాశయం నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఏడుపాయల వన దుర్గభవాని ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం వాగులో కొట్టుకుపోయి మహిళ మరణించింది.
మూసీకి పోటెత్తిన వరద
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (విజయక్రాంతి)/మలక్‌పేట: వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని జం ట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరు తోంది. గురువారం ఉదయం నుంచి వరద ప్రవా హం అంతకంతకూ పెరగడంతో, అధికారులు మొదట 11 గేట్లను ఎత్తి నీటిని మూసీ నదిలోకి వదిలారు.
సాయంత్రానికి ఇన్‌ఫ్లో 9000 క్యూసెక్కులు కొద్దిగా తగ్గడం తో రెండు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం 9 గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి, 12,042 క్యూసెక్కుల నీటిని దిగువకు విడు దల చేస్తున్నారు. దీంతో మూసీ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఉగ్రరూపం దాల్చి న మూసీ పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో ముసారాంబాగ్, జియాగూడ ప్రాంతాల్లోని ప్రధాన రహదా రులను మూ సివేశారు.
మూసీ ఉధృతికి మూసానగర్, శంకర్ నగర్ బస్తీలు నీట మునిగాయి. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 127 ఇళ్లలోకి వరద నీరు చేరింది. జీహెచ్ ఎంసీ, రెవెన్యూ, డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయ క చర్యలు చేపట్టాయి. ముసానగర్‌లోని 110 మందిని, శంకర్ నగర్‌లోని 290 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వీరి కో సం సమీపంలోని కమ్యూనిటీ హాళ్లు, ప్రభు త్వ పాఠశాలల్లో మొత్తం ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంకా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు రావాలని అధికారులు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
రహదారుల మూసివేత
మూసీ వరద ప్రవాహం కారణంగా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా పలు ప్ర ధాన రహదారులను మూసివేశారు. మూసీ పై ఉన్న ముసారాంబాగ్ బ్రిడ్జిని పూర్తిగా మూసివేసి, వాహనాలను దారి మళ్లించారు. జియాగూడ నుంచి పురానాపూల్‌కు వెళ్లే రహదారిని కూడా మూసివేశారు. హిమాయత్‌సాగర్ నీటి విడుదల కారణంగా రాజేంద్రనగర్ వద్ద ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుపైకి వరద నీరు చేరడంతో, పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహన రాకపోకలను నిలిపివేశారు.
మూసీ నదిలో ఉన్న దోభీఘాట్‌లను కూడా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బోరబండ, ఎస్‌ఆర్ నగర్, సనత్‌నగర్‌తో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
త్రివర్ణ విద్యుత్ కాంతుల్లో సాగర్
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తిన అధికారులు
నాగార్జునసాగర్, ఆగస్టు 14 (విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగార్జునసాగర్ డ్యామ్‌కు జాతీయ జెండాను ప్రతిబింబించేలా మూడు రంగుల రూపంలో విద్యుత్ బల్బులను అమర్చి, నీటిని విడుదల చేశారు. 26 గేట్ల నుంచి మువ్వన్నెల జెండా రంగులతో గురువారం రాత్రి నీటిని విడుదల చేశారు. కాగా నాగార్జునసాగర్‌కు శ్రీశైలం జలాశయం నుంచి 1,72,774 క్యూసెక్కుల వరద ఉధృతి కొనసాగుతున్నది.
అధికారులు 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,03,502 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 587.40 అడుగులవద్ద నీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 305.7464 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఏడుపాయల ఆలయం తాత్కాలికంగా మూసివేత
పాపన్నపేట, ఆగస్టు 14: తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గభవాని ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణం శాఖ హెచ్చరికతో పాటు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయడంతో మంజీరా నదిలో వరద ప్రవాహం విపరీతంగా పెరిగింది. దీంతో ఆలయం ముందు పాయలో వరద భారీగా ప్రవహిస్తున్నది. దీంతో గురువారం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భక్తుల కోసం ఆలయ ప్రధాన ద్వారం వద్ద రాజగోపురంలో దుర్గాభవాని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రధాన ఆలయం వైపు ఎవరు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు.
నిండుకుండలా మారిన ఉస్మాన్ సాగర్
రంగారెడ్డి/చేవెళ్ల(విజయకాంత్రి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో ప్రధానమైన మూసీ, ఈసీ వాగులు ఉధృతంగా పారుతున్నాయి. ఈసీ మొయినాబాద్ మండలం వెంకటపూర్ వద్ద బ్రిడ్జికి ఆనుకొని పారుతోంది. ఉస్మాన్ సాగర్ జలాశయంలోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1,784.6 అడుగులకు చేరింది. మరో 5.4 అడుగులు చేరితే పూర్తిస్థాయి(3.9 టీఎంసీలు) నీటిమట్టానికి చేరుకుంటుంది.
ప్రస్తుతం మూసీ నుంచి 6,800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఈ వరద ఇలాగే కొనసాగితే నేడో రేపో గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది. చేవెళ్ల డివిజన్ పరిధిలో వాగులు, చెక్ డ్యాములు పొంగిపొర్లుతున్నాయి. కొత్తూరు మండలం గూడూరు గ్రామంలోని రామయ్య చెరువు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. కాశన కుంట, చింత్ చెరువు, ఉప్పరవాని కంట, బేస్తవాని కుంట ఇప్పటికే అలుగు పారుతున్నాయి.
వరద ఉధృతికి కొందుర్గు గంగన్న గూడెం రహదారిపై పెద్దపెద్ద గుంతలు పడటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అయ్యవారిపల్లి వాగు ప్రమాదకరం ప్రవహిస్తుండటంతో పలు గ్రామలకు రాకపోకలు స్తంభించాయి. షాద్ నగర్ పరిధిలోని నాగులపల్లి గ్రామానికి వెళ్లే రహదారిలో వరద పొంగుతుండటంతో ఈ ప్రాంతాలకు కనెక్షన్ కట్ అయ్యింది. వాగుల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజలు వెళ్లకుండా పోలీసులు కాపలా ఉంటున్నారు.
ఆమనగల్, కడ్తల, తలకొండపల్లి,మాడుగుల, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, మహేశ్వరం లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. మీర్పేట్, బడంగ్‌పేట్ కార్పొరేషన్ లో పలు లోతట్టు కాలనీలో నీట మునిగాయి. తుక్కుగూడ శ్రీశైలం,హైదరాబాద్ జాతీయ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి నుంచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.