19-09-2025 11:02:56 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): మహాలక్ష్మి పథకంతో నష్టపోయిన ఆటో, రవాణారంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఏఐటీయూసీ అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య నేతృత్వంలో చుంచుపల్లి మండలం బైపాస్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు.
ఆటో కార్మికులు చేపట్టిన పాదయాత్రకు సిపిఐ రాష్ట్ర ఆపార్టీ పక్షాన సంఘీభావం తెలిపిన అనంతరం కూనంనేని మాట్లాడుతూ... మహాలక్ష్మి పథకంలోని మహిళలు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఈ పథకంతో ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.
సంక్షేమ పథకాల్లో కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈఎస్ఐ, భీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. సబ్సిడీతో కూడిన రుణాలను ఆటోల కొనుగోలుకు అందించాలని కోరారు. అనంతరం యూనియన్ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా ధర్నాలో పాల్గొని మాట్లాడారు.