02-11-2025 12:30:28 AM
పనిలో రాజీలేదు.. స్వచ్ఛతలో తిరుగు లేదు
అనేక ఔషధ గుణాలున్న పసుపు, ఇటు వంటల్లోనూ అటు ఆరోగ్యపరంగానూ ఎంతో ప్రత్యేకత ఉన్న పసుపును కొంతమంది కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ.. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి కల్తీని నివారించేందుకు కొందరు ట్రెండ్ సృష్టిస్తూ.. వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారు. మొబైల్ మిల్లులు(సంచార పసుపు మిల్లులు)ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు.
ఇలా ప్రయత్నించి.. అందరిచేత ‘ఔరా.. సంచార మర! పనిలో రాజీలేదు.. స్వచ్ఛతలో తిరుగులేదు’ అని అనేలా చేస్తున్నాడు మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన జల్లి చంటి. తను రూ.4లక్షలతో ఆటో, రూ.60వేలతో పసుపు పట్టే మర యంత్రం కొనుగోలు చేశాడు. ఆ యంత్రాన్ని ఆటోలో బిగించుకున్నాడు. పసుపును బాగా పండించే నిజామాబాద్ నుంచి గోళ బజాజ్- రకం పసుపు కొమ్ములను నేరుగా తెప్పించుకుని, జిల్లాలోని ప్రతీ పల్లెకు తన ఆటోలో ఏర్పాటు చేసుకున్న మరతో తిరుగుతున్నాడు. మన కళ్లెదుటే స్వచ్ఛమైన పసుపు కొమ్ములను మర యంత్రంలో వేసి, కల్తీ లేని పసుపును ప్రజలకు అందిస్తున్నాడు.
నాణ్యమైన పసుపును అందరికీ అం దించడంతోపాటు వచ్చే డబ్బుతో తనూ జీవనోపాధి పొందుతున్నాడు. ‘దుకాణాలలో కొనుగోలు చేసే పసుపు లో పిండి కలుపుతున్నారు. కానీ ఇక్కడ మన కళ్ల ఎదుట నాణ్యమైన పసు పు కొమ్ములు వేసి, మరాడిస్తున్నాడు. స్వచ్ఛమైన పసుపును మనకు అందిస్తున్నాడు’ అని అంటూ పల్లెల్లో మహిళలు చంటి పసుపు మరయంత్రం దగ్గరికి తరలివస్తున్నారు.
బారులు తీరి పసుపును పట్టించుకుని, తీసుకువెళ్తున్నారు. చూసే వారు మాత్రం ఇది వినూత్నమైన ఆలోచన అని, ఇలా చేయడం వల్ల మనకు నాణ్యమైన పసుపుతో పాటు అతనికి జీవనోపాధి కలుగుతుందని, ఇలా అన్నీ మరాడించే యంత్రాలు ఇంటి ముందుకొస్తే మరింత బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి)
నాణ్యతతో కూడిన పసుపు అందించాలనే..
దుకాణాల్లో వచ్చే పసుపు మెత్తగా ఉండకపోవడం, అందులో కొంత కల్తీ కలవడం లాంటివి జరుగుతుంటుంది. దానికి అడ్డుకట్ట వేయడానికే ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వెళుతున్నా. పసుపు కొమ్ములు కూడా నాణ్యమైనవే కొనుగోలు చేసి తీసుకొస్తున్నా. అందరి ముందే మరాడించి స్వచ్ఛమైన పసుపును అందిస్తున్నా. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ సంతోషపడుతున్నారు. నాకు పైసలు వస్తున్నాయి అనే భావన కంటే అందరికీ నాణ్యమైన పసుపును అందిస్తున్న అనే సంతృప్తి కలుగుతుంది.
-జల్లి చంటి(మొబైల్ మిల్లు యజమాని)