calender_icon.png 5 January, 2026 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త ఏడాదిలో పాత ట్రెండ్

04-01-2026 12:00:00 AM

మౌనమే నీ భాష అన్నట్లుగా వెండితెరపై మాటలు లేకుండా భావాలను పండించే మూకీ సినిమాల ట్రెండ్ మళ్లీ మొదలవుతోంది. తాజాగా 2026 ప్రారంభంలో ఈ ప్రయోగాత్మక చిత్రాలపై పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలతోపాటు ‘భ్రమయుగం’ వంటి వినూత్న చిత్రాలను ఆదరిస్తున్న నేపథ్యంలో ఈ మూకీ ప్రయోగాలు ఏ మేరకు మెప్పిస్తాయన్నదే ఆ చర్చల సారాంశం. ఏదేమైనా కొత్త ఏడాదిలో పాత ట్రెండ్ తెరపైకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

నెలాఖరున ‘గాంధీ టాక్స్’ 

ఈ ఏడాది అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్’. విజయ్ సేతుపతి, అదితి రావు హైదరీ, అరవింద్ స్వామి, మరాఠీ నటుడు సిద్ధార్థ్ జాదవ్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘సా ససుచ’, ‘యేడా’ వంటి మరాఠీ చిత్రాలకు దర్శకత్వం వహించిన కిషోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను 2021లో ప్రకటించారు.

చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాల తర్వాత 2023లో గోవాలో జరిగిన 23వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)లో ప్రదర్శితమైన తొలి మూకీ సినిమా ఇదే కావటం విశేషం. గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఈ మూవీ టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. మాటలు లేని చిత్రాలకు సంగీతమే ప్రాణం.

ఈ ‘గాంధీ టాక్స్’లో రెహమాన్ ‘రఘుపతి రాఘవ రాజారాం..’ గీతాన్ని వాయిద్యాలతో వినిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘వారు మౌనంగా ప్రేమించుకున్నారు’, ‘వారు మౌనంగా పాపం చేశారు’, ‘వారు మౌనంగా బాధపడ్డారు’, ‘ఈ సినిమా ఆ మౌనంగా మాట్లాడుతుంది’ అంటూ సాగిన ఈ టీజర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. టీజర్ విడుదలైన సందర్భంగా చిత్ర దర్శకుడు కిషోర్ బెలేకర్ మాట్లాడుతూ “నిశ్శబ్దం అనేదాన్ని నమ్మి ‘గాంధీ టాక్స్’ సినిమాను రూపొందించాం.

శతాబ్దంగా ఇండియన్ సినీ మేకర్స్ పలు రకాలైన కథలతో సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి కళలో నటన, భావోద్వేగాలను ఆధారం చేసుకుని సినిమా చేయాలనుకున్నాం. నటీనటులు దీనికి ఈ కొత్త ప్రయత్నంలో భాగం కావటానికి ముందుకు రావటంతో పాటు సున్నితమైన భావాలను చక్కగా పలికించారు. అదే సమయంలో ఏఆర్ రెహమాన్ సంగీతం.. సినిమా కథను చెప్పే వాయిస్‌గా మారింది. జీస్టూడియోస్, మీరా చోప్రా సహకారంతో ధైర్యంగా, నిజాయతీగా కొత్త ప్రయత్నాన్ని చేశాం” అని పేర్కొన్నారు. మొత్తంగా నిశ్శబ్దం ద్వారా ఎంతో చెప్పగలమనే కొత్త సినిమాటిక్ అనుభవాన్ని ప్రేక్షకులకు ‘గాంధీ టాక్స్’ అందించనుందని అర్థమవుతోంది. 

మన తొలి మూకీ సినిమా.. 

తెలుగు నాట తొలి మూకీ సినిమా.. ‘భీష్మ ప్రతిజ్ఞ’ (1921). దీనికి రఘుపతి వెంకయ్య నాయుడు, ఆయన కుమారుడు ఆర్‌ఎస్ ప్రకాశ్ దర్శకత్వం వహించారు. గతంలో కమల్‌హాసన్ నటించిన ‘పుష్పక విమానం’ ఒక క్లాసిక్ మూకీ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు విజయ్ సేతుపతి వంటి నటులు అలాంటి సాహసం చేయడంపై సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ కూడా ఒక ప్రయోగాత్మక మూకీ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇది కమల్‌హాసన్ నటించిన ప్రఖ్యాత ‘పుష్పక విమానం’ తరహాలో ఉంటుందని భావిస్తున్నారు.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘కోతి’ ప్రధాన పాత్రలో రూపొందుతున్న గ్రాఫిక్స్ కామెడీ మూవీ అప్డేట్స్ కూడా ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది కూడా మూకీ సినిమాగా రానుందని తెలుస్తోంది.