calender_icon.png 23 November, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకవైపు సన్నద్ధం.. మరోవైపు సందిగ్ధం..

10-02-2025 12:36:43 AM

* మేడ్చల్ జిల్లాలో పంచాయతీ  ఎన్నికలపై అయోమయం 

* జిల్లాలో మిగిలింది  34 జీపీలు మాత్రమే 

* మూడు జడ్పీటీసీలతో జిల్లా పరిషత్ కొనసాగడం సాధ్యమేనా? 

మేడ్చల్, ఫిబ్రవరి 9(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఆశావహుల్లో మాత్రం సందిగ్ధం నెలకొంది. జిల్లాలో మిగిలిన గ్రామ పంచాయతీలను కొనసాగించాలా, పురపాలక శాఖలో విలీనం చేయాలా అనే విషయములో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనందున అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లే మేడ్చల్ జిల్లాలోనూ చేస్తున్నారు.

రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్న పరిస్థితి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో లేదు. జిల్లాలో కేవలం 34 గ్రామపంచాయతీలు మాత్రమే ఉన్నాయి. మూడు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, 19 ఎంపీటీసీలు మాత్రమే ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో ఉప్పల్, మల్కాజిగిరి, కూకట్ పల్లి పూర్తిగా జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్నాయి.

కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో సగం జిహెచ్‌ఎంసి పరిధిలో ఉండగా, ఒక కార్పొరేషన్ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలో మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి.

ఇదే నియోజకవర్గంలో మొన్నటి వరకు ఐదు మండలాలు, 62 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇటీవల 28 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేశారు. కీసర, ఘట్కేసర్ మండలాల్లోని గ్రామాలన్నీ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. దీంతో మేడ్చల్, షామీర్పేట్, మూడు చింతలపల్లి మండలాల్లోని 19 ఎంపీటీసీలు, 34 గ్రామపంచాయతీలు మిగిలాయి. 

మూడు జడ్పీటీసీ లతో జిల్లా పరిషత్ కొనసాగేనా? 

మూడు జడ్పీటీసీ లతో జిల్లా పరిషత్ కొనసాగడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో కొన్ని మండలాల్లో మూడు, నాలుగు ఎంపీటీసీ లు ఉండగా, ఎంపీపీ ఎన్నికకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కనీసం ఐదు ఎంపిటిసిలు ఉండేలా పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ మేరకు చిన్న మండలాల్లో జనాభా లేకున్నా ఐదు ఎంపీటీసీలు ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లాలో జడ్పీటీసీలు పెంచే అవకాశం లేదు. జడ్పిటిసిలు పెంచాలంటే పొరుగు జిల్లాలైన సిద్దిపేట్, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి కొన్ని మండలాలు మేడ్చల్ జిల్లాలో విలీనం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ జిల్లాల్లో అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది.

కొత్తగా మూడు లేదా నాలుగు మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి 34 గ్రామపంచాయతీలను విలీనం చేస్తారని భావించారు. కానీ ఇటీవల రాష్ట్రంలో కొత్తగా 12 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినప్పటికీ జిల్లాలో ఒకటి కూడా ఏర్పాటు చేయలేదు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తారో, ఏ క్షణమైనా మున్సిపాలిటీలో విలీనం చేస్తారో తెలియడం లేదు.

జిహెచ్‌ఎంసిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అలా విలీనం చేస్తే ప్రస్తుతం జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ విలీనం అవుతాయి. 34 జిపిలు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుకు  దూరంలో ఉన్నాయి.

ఎన్నికలకు ఏర్పాట్లు 

ప్రభుత్వ నిర్ణయం వెలువడనందున పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటరు నమోదు, పోలీస్ స్టేషన్ ల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపీటీసీల ముసాయిదాను విడుదల చేశారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం 

-పంచాయతీ, స్థానిక సంస్థలకు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 34 జిపి లో ఉన్నాయి. మూడు మండలాల్లో 19 ఎంపీటీసీ లను ఏర్పాటు చేశాం.

 కాంతమ్మ, జిల్లా పరిషత్ సీఈవో, మేడ్చల్ జిల్లా