17-11-2025 01:44:44 AM
హిందూ ధర్మంలోని 16 ముఖ్య సంస్కారాలలో వివాహం అనేది అత్యంత ప్రధానమైనది. ఇది భార్యాభర్తలు ఆధ్యాత్మిక ఎదుగుదలలో కలిసి నడవడానికి ఏర్పడిన శాశ్వతబంధం. మన దేశంలో వివాహాలను ఘనంగా నిర్వహించడం, తద్వారా పేరు ప్రఖ్యాతలు పొందడం సంప్రదాయం. అయితే, నల్లగొండ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెరుమాళ్ల ఆనంద్.. 2021లో తన కుమారుడి వివాహాన్ని చిరస్మరణీయం చేయడానికి ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు.
ఖర్చుతో కూడిన వేడుకలకు బదులుగా ఆయన ‘చేతిలో చెయ్యేసి’ అనే పేరుతో ఒక కథల సంపుటిని రూపొందించారు. వివాహ సంస్కారానికి ప్రతీకగా నల్లగొండ జిల్లాలోని 16మంది ప్రముఖకవులు, రచయితల సహకారంతో వివాహ నేపథ్యంపై 16కథలను రాయించారు. ఈ కథల సంపుటిని ఆనంద్ కుటుంబం తమ కుమారుడికిచ్చిన అత్యంత విలువైన కానుకగా నిలిచింది.
ఈ సంపుటిలో పెళ్లి నేపథ్యంతో కూడిన వైవిధ్యమైన సామాజిక అంశాలను స్పృశించిన కథలు ఉన్నాయి. ‘ప్రేమ అల్లాల్సిన కొత్త కథ’ సంపుటిని డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి రాశారు. ఈ కథ కులాంతర వివాహం నేపథ్యంగా సాగుతుంది. ప్రేమవివాహం చేసుకున్న యువత తొందరపాటు నిర్ణయాలు తీసుకుని కుటుంబాలకు దూరమవ్వడం, ఆ తర్వాత వాస్తవానికి లోబడి చేసిన తప్పులను ఎలా చక్కదిద్దుకున్నారు అనే చక్కని సందేశాన్ని ఇస్తుంది.
‘నెమలి నవ్వింది’ కథ సంపుటిని శీలం భద్రయ్య రచించారు. యువతీ, యువకులు తమ భాగస్వామిని ఎంచుకోవడంలో శరీరరంగుకు(ఛామచాయ) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడాన్ని ప్రశ్నిస్తూ, మనుషుల శరీర రంగులకంటే అసలు ప్రాధాన్యమైన అంశం ఏదో రచయిత ఈ కథలో చక్కగా వివరించారు. ‘నూరేళ్ల పంట’ కథ సంపుటిని- డాక్టర్ ఉప్పల పద్మ రచించారు. పెళ్లి తంతులో జరిగే సంఘటనలను, కు టుంబాల్లోని విభిన్నమనస్తత్వాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ, అనవసరంగా ఎదుటివారిపై అసూయ లేదా తప్పుడు గుణం కలిగి ఉన్న వ్యక్తులు మానసికంగా ఎదుర్కొనే బాధలను దృశ్యమానం చేశారు.
‘గురు దక్షిణ’ కథను- తుల శ్రీనివాస్ రాశారు. ఈ కథలో ఉపాధ్యాయుడు రాజారాం ప్రధాన పాత్ర. చురుకైన విద్యార్థిని చదువు పూర్తి కాకముందే మేనరికపు పెళ్లి చేసినప్పుడు బాధపడిన గురువు, తన విద్యార్థి జీవితం బంగారు భవిష్యత్తు నిర్మాణానికి ఎలా దోహదపడ్డారో చాలా గొప్పగా చెప్పారు. ‘బతుకు గీత’ కథను డాక్టర్ మండల స్వామి రచించారు. భర్త చనిపోయినా, ఇద్దరు ఆడపిల్లలను కొడుకుల్లా పెంచిన తల్లి పోరాటాన్ని, అలాగే భర్త వేధింపులకు గురైన భార్య బాధలను తెలియజేస్తూ, సమాజంలో ఆడపిల్లలను కన్న తల్లులు అనుభవించే బాధను ఈ కథ తెలియజేస్తుంది.
‘చేతిలో చెయ్యేసి’ కథను- బండారు శంకర్ రచించారు. అగ్రవర్ణాల అమ్మా యి, తక్కువ కులం అబ్బాయి మధ్య ప్రేమబంధం, వారిని అంగీకరించని తల్లిదండ్రులు, వారి ప్రేమను నిరూపించుకోవడానికి ఆ యువజంట పడే త్యాగాలు, కష్టాలను రచయిత చక్కగా చెప్పారు. సాధారణంగా వివాహ వేడుకలు ఖర్చులకే పరిమితమై మరుగునపడిపోతాయి.
కానీ, పెరుమాళ్ల ఆనంద్ చేపట్టిన ఈ ‘చేతిలో చెయ్యేసి’ కథల సంపుటి రూపకల్పన, వివాహానికి సామాజిక స్పృహ, సాహి త్య విలువలతో కూడిన శాశ్వతమైన వారసత్వాన్ని అందించింది. 16 మంది రచయితలు 16 కథల ద్వారా వైవాహిక, సామాజిక అంశాలను చర్చించడం వివాహ బంధం బహుముఖీనమైన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. పెరు మాళ్ల ఆనంద్ ఈ వినూత్న ఆలోచన, వివాహ వేడుకలకు ఖర్చు చేసే ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప ఆదర్శం, స్ఫూర్తిగా నిలుస్తుంది.