25-10-2025 08:55:18 PM
జూనియర్ సివిల్ జడ్జి భావన..
మహబూబ్ నగర్: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుపై దృష్టి పెట్టాలని జూనియర్ సివిల్ జడ్జి భావన సూచించారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని చైతన్య హైస్కూల్లో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా చదువుపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ఫోక్సో, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాల నివారణ, బాలల చట్టాలు, హక్కులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
చట్టాలపై అవగాహన పెంచుకొని ఇంట్లో కుటుంబాన్ని సక్రమ మార్గంలో తీర్చిదిద్దుకునేలా కృషి చేయాలని సూచించారు. సీనియర్ న్యాయవాది రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. వాహనాలను పిల్లలకు ఇవ్వవద్దని, తద్వారా అనేక ప్రమాదాలకు కారణం అవుతున్నారని అన్నారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే చట్టపరంగా తల్లిదండ్రులు లేదా వాహనాలు ఇచ్చినవారు శిక్షార్హులు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు యోగేశ్వర్ రాజ్ యాదవ్, మల్లారెడ్డి, అశోక్ గౌడ్, పి ఎల్ వి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.