5 May, 2026 | 10:53 PM

టానిక్ లిక్కర్ మార్ట్ సీజ్

02-09-2024 02:51 AM
  1. ఆగస్టు 31తో ముగిసిన గడువు 
  2. రెన్యూవల్ అప్లికేషన్‌ను తిరస్కరించిన ఎక్సైజ్ శాఖ
  3. గత ప్రభుత్వం అండతో టానిక్‌లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ఎక్సైజ్ చట్టానికి విరుద్ధంగా ఏర్పాటైన టానిక్ లిక్కర్ మార్ట్‌ను ఎక్సైజ్ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. గత ప్రభుత్వ పెద్దల అండతో 2016లో రాష్ట్రంలోని ఏ వైన్‌షాప్‌కు లేని విధంగా ప్రత్యేక అనుమతులతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో టానిక్ లిక్కర్ మార్ట్‌ను నెలకొల్పారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ప్రతీ రెండేండ్లకోసారి మద్యం షాపులకు వేలం నిర్వహిస్తారు.

కానీ, నిబంధనలకు విరుద్ధంగా టానిక్ లిక్కర్ మార్ట్‌కు మాత్రం బార్ లైసెన్స్ లాగా ప్రతీ సంవత్సరం రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నేపథ్యంలో లిక్కర్ మార్ట్ గడువు ఆగస్టు 31తో ముగియగా, యాజమాన్యం 2024 రెన్యూవల్ కోసం అప్లయ్ చేసుకుంది. కానీ రెన్యూవల్‌ను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శాస్త్రి, అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్ రెడ్డి, జూబ్లీహిల్స్ సీఐ వాసుదేవరావు ఇతర ఎక్సైజ్ పోలీసులు కలిసి ఆదివారం టానిక్ ఎలైట్ వైన్‌షాప్‌ను సీజ్ చేశారు. మార్ట్‌లో ఉన్న రూ. 1.70 కోట్ల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

గత ప్రభుత్వం అండతో..

గత ప్రభుత్వ అండతో ఎవరికి లేనట్లు ప్రత్యేక అనుమతులతో లాటరీ లేకుండానే ఏ4 ఎలైట్ పేరుతో స్పెషల్ జీవోతో ఈ లిక్కర్ మార్ట్‌కు అనేక రాయితీలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టినట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు.  ఒకే షాప్ లైసెన్స్‌తో సిటీలో మొత్తం 11 చోట్ల బ్రాంచీలను ఏర్పాటు చేసి, మద్యం విక్రయాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వం ఈ మార్ట్‌కు ఎక్కడి నుంచైనా లిక్కర్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. టానిక్ లిక్కర్ మార్ట్ బీఆర్‌ఎస్ పెద్దలకు సం బంధించినది కాబట్టే అధికారులెవరూ అ టూ వైపు తొంగిచూడలేదని విమర్శలు వ స్తున్నాయి. అన్నీ వైన్‌షాపుల్లో మద్యం అ మ్మకాలకు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటే, టానిక్ మార్ట్‌కు మాత్రం అర్ధరాత్రి 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు.