10 April, 2026 | 3:43 AM

పీఎస్‌యూ భూములను రాష్ట్రానికే ఇవ్వాలి

29-06-2024 12:20 AM

ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరించాలి

కేంద్రమంత్రి కుమారస్వామికి మంత్రి శ్రీధర్‌బాబు వినతి

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): తెలంగాణ గతంలో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లకు కేటాయించిన భూములను తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. కేంద్రమంత్రిని ఢిల్లీలో శ్రీధర్‌బాబు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన శ్రీధర్‌బాబు.. ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రం పెట్టుబడులను ఉపసంహరించుకున్న నేపథ్యంలో మిగులు భూములను రాష్ట్ర సర్కారుకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ సర్కారు అనేక ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేసిందని, వాటికి వేలాది ఎకరాల భూములను కేటాయించిందని గుర్తుచేశారు.

ఆదిలా బాద్ సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరించి, స్థానికులకు ఉపాధిని కల్పించాలని కేంద్రమంత్రికి ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి వినతిపత్రం అందజేశారు. దాదాపు 4 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ సిమెంట్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం 2,100 ఎకరాల సున్నపు రాతి గనులతో పాటు మొత్తం 2,290 ఎకరాల భూమిని ఉచితంగా అందజేసిందని గుర్తు చేశారు. అందుకే ఈ పరిశ్రను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. అంతేకాకుండా తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటులో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కుమారస్వామిని శ్రీధర్‌బాబు కోరారు. తెలంగాణలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. అలాగే తెలంగాణలో పర్యటించాలని కేంద్రమంత్రిని శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. దీనికి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.