30-04-2025 12:00:00 AM
‘పవన్‌కల్యాణ్ సెట్స్‌పైకి వస్తున్నారు. కాల్షీట్లు కేటాయిస్తున్నారు. నెలాఖరు వరకల్లా మొత్తం ముగిస్తారు’ అంటూ ఈ మాసం ఆరంభంలో మేకర్స్ చెప్పిన ముచ్చట్లు! తీరా ఇప్పుడు చూస్తే, ఏప్రిల్ ఫూల్ చేశారని అభిమానులకు అర్థమవుతోంది. అసలు జరుగుతున్న ప్రచారమంతా నిజమేనా? కాల్షీట్లు ఇస్తానని స్వయంగా పవన్ చెప్తున్నారా? ఈ మాటలు ఎవరు చెప్పినా నీట మూటలే అవుతున్నాయి.
ఎందుకంటే, ఇప్పుడు ఏప్రిల్ నెల కూడా ముగిసింది. కానీ పవన్ కల్యాణ్ సెట్స్‌పైకి రాలేదు. ఇదేం కొత్త కాదు మార్చిలోనూ ఇలానే జరిగింది. పవన్ 2 వారాలపాటు కాల్షీట్లు కేటాయించారని.. ‘హరిహరవీరమల్లు’తోపాటు ‘ఓజీ’ చకచకా పూర్తి చేయనున్నారని ప్రచారం జరిగింది. ఇలా పుకార్లు, ఊహాగానాలతోనే గడిచిపోతోంది తప్ప పవన్ సైన్ చేసిన సినిమాలు ఒక్కంటంటే ఒక్కటి కూడా ఒక్క అడుగైనా ముందుకేసింది లేదు.
మే నెలలోనైనా పవన్ కాల్షీట్లు ఇస్తారేమోనన్న ఆశతో ఎదురుచూ స్తున్నారు నిర్మాతలు. ‘వీరమల్లు’ కోసం ఐదంటే ఐదు రోజులు కేటాయిస్తే సరిపోతుందట. ‘ఓజీ’ పరిస్థితీ అంతే! ఈ సినిమా కూడా ఆఖరలో ఉంది. ఇలా ఈ రెండు సినిమాలకు కేవలం 2 వారాల పాటు కాల్షీట్లు కేటాయిస్తే సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చని అనేది నిర్మా‘తల్లో’ మెదులుతున్న ఆలోచన అట. మరి ఈ మేలోనైనా నిర్మాతల మనసులో మాటను గురుడు వింటారా? చూడాలి!