calender_icon.png 1 May, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుకే పేరు మార్చుకుందట!

30-04-2025 12:00:00 AM

ఇవానా.. హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కానున్న కొత్తందం. ఈ అమ్మడు గతంలోనే టాలీవుడ్‌కు తెలుసు. కానీ, హీరోయిన్‌గా కాదు. 2022లో తమిళం, తెలుగులో విడుదలైన లవ్‌టుడే చిత్రం ద్వారా తెలుగు తెరపై మెరిసింది. ఇందు లో నిఖిత పాత్రలో ఆకట్టుకొని తెలుగు కుర్రాళ్ల డ్రీమ్‌గర్ల్‌గా మారిపోయింది. ఇప్పుడు శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘సింగిల్’ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొస్తోంది.

కార్తీక్ రాజు దర్శకత్వంలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇందులో కేతికాశర్మతోపాటు ఇవానా మరో కథానాయికగా నటిస్తోంది. ఇటీవల తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది ఇవానా. “నా అసలు పేరు అలీనా షాజీ. 2000 ఫిబ్రవరి 25న కేరళలోని చంగనాచెరిలో ముస్లిం కుటుంబంలో జన్మించాను.

తిరువనంతపురం లోని కేరళ యూనివర్సిటీ నుంచి బీకామ్ పట్టా పొందాను. మాలీవుడ్‌లో బాల నటిగా కెరీర్ షురూ చేశా. 2012లో ‘మాస్టర్స్’లో సహాయ పాత్రలో తొలిసారి వెండితెరపై కనిపించాను. ఆ తర్వాత రాణి పద్మిని (2015), ‘అనురాగ కరిక్కిన్ వెళ్లం’ (2016) చిత్రాల్లో నటించాను.

దర్శకుడు బాలా.. నా నటనను గుర్తించి 2018లో తమిళ చిత్రం ‘నాచియార్’లో జ్యోతిక, జీవీ ప్రకాశ్‌కుమార్‌లతో కలిసి కీలక పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. కాగా ఈ సినిమా తెలుగులో ‘ఝాన్సీ’గా అనువాదమయ్యింది. ఆ సినిమా టైమ్‌లోనే తమిళ ప్రేక్షకులు పలికేందుకు సులభంగా ఉంటుందని నా పేరును ఇవానాగా మార్చుకున్నాను” అని చెప్పుకొచ్చింది.