01-05-2025 12:44:29 AM
ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక హక్కుల సంఘాలు డిమాండ్
ఖమ్మం, ఏప్రిల్ 30 ( విజయక్రాంతి ):-మంచికంటి భవన్లో బుధవారం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ’ఆపరేషన్ కగార్’ ను వెంటనే ఆపేయాలని, ఆదివాసులపై జరుగుతున్న దాడిని నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని, అదేవిధంగా ఆపరేషన్ కర్రిగుట్టలు పేరుతో కొనసాగిస్తున్న కేంద్ర బలగాలను వెంటనే వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు - మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ పాటించి శాంతి చర్చలు జరపాలని వివిధ పార్టీలు, పౌర హక్కుల సంఘాలు కోరడం జరిగింది. శాంతీయుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలనీ, ప్రభుత్వాలు రాజ్యాంగబద్దంగా వ్యవహరించి శాంతియుత వాతావరణం నెలకొల్పి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి.
రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలి. పారా మిలిటరీ బలగాలతో బల ప్రయోగంతో కాకుండా శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని కోరుతున్నాం. ఈ రౌండ్ సమావేశంలో మే 2న ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించాలని, అన్ని మండల కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రముఖ విద్యావేత్త రవి మారుత్, కాకి భాస్కర్, కిషన్ నాయక్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. అన్ని ప్రధాన పార్టీల, అనుబంధ సంఘాలు, పౌర హక్కుల నాయకులు, విద్యావేత్తలు,తదితరులు పాల్గొన్నారు.