17-07-2025 12:34:41 AM
-డయాగ్నొస్టిక్ కేంద్రాల నయా దందా
-ఫేక్ రిపోర్టులతో అమాయకులకు బురిడీ
-తప్పుడు రిపోర్టుల వెనుక ‘ప్రైవేటు’ ముఠా
నల్లగొండ నేర విభాగం, జూలై 16 (విజ య క్రాంతి): ‘వైద్యో నారాయణో హరి’ అనే నానుడికి నల్లగొండ జిల్లా కేంద్రంలోని రివర్స్ డయాగ్నస్టిక్ సెంటర్ కొత్త అర్థం చెబుతోంది. ప్రైవేటు ఆస్పత్రులతో కుమ్మక్కై తప్పుడు రిపోర్టులు సృష్టించే కొత్త దందాకు తెరలేపారు. ఆపదని వస్తే.. లేనిదాన్ని ఉన్నట్టుగా చూపి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ డయాగ్నస్టిక్ కేంద్రానికి వచ్చే వారి ఉన్న ప్రాణాలు పోయేలా వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది.
అత్యాశకు పోయి తప్పుడు రిపోర్టులతో పేషంట్ల ప్రాణాలతో చెలగాటమాడడం రివర్ డయాగ్నిస్టిక్ సెంటరుకు పరిపాటిగా మారింది. ప్రైవేటు ఆస్పత్రుల వక్రబుద్ధిని సదరు డయాగ్నిస్టిక్ సెంటర్ సొమ్ము చేసుకుంటోంది. నల్లగొండి జిల్లా కేంద్రంలోనే ఈ డయాగ్నస్టిక్ సెంటరు ఉన్నా.. జిల్లా ఉన్నతాధికారులంతా ఈ కేంద్రం ముందు నుంచే నిత్యం రాకపోకలు సాగిస్తున్నా.. ఈ అక్రమ దందాపై శీతకన్ను వేశారనే చెప్పాలి.
గాల్ బ్లాడర్లో 10 ఎంఎం స్టోన్
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన కసర్ల కనకమహాలక్ష్మీ అనే మహిళ ఇటీవల డెలీవరీ అయ్యింది. పది రోజులు తిరగకుండానే జూలై 11న రివర్ డయాగ్నిస్టిక్ సెంటరుకు ‘వెసికల్ కాల్క్యులస్’(ముత్రాశయంలో రాయి) సమస్యతో బాధపడుతూ స్కానింగ్ కోసం వచ్చింది. అయితే సదరు రివర్ డయాగ్నిస్టిక్ ఇచ్చిన అల్ట్రాసౌండ్ నివేదికలో మూత్రాశయంలో 10 ఎంఎం రాయి(స్టోన్) ఉన్నట్టుగా తేల్చి రిపోర్టు ఇచ్చారు.
అయితే దీంతో కంగారుపడిన సదరు మహాలక్ష్మీ కుటుంబంలోని నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని సంప్రదించగా, సదరు వైద్యులు అత్యవసరంగా సర్జరీ చేయాలని తేల్చి చెప్పారు. దీంతో మహాలక్ష్మీ భర్త సదరు పేషంట్ను హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ తీసిన సీటీ కేయూబీ రిపోర్టులో అసలు ఏలాంటి రాళ్లు(స్టోన్) లేవని తేలింది. దీంతో మహాలక్ష్మీతో పాటు కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు.
నిజానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్కు, సిటీ స్కానింగ్ కొన్ని కేసుల్లో కొంచెం తేడా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ కేసులో మాత్రం 10 ఎంఎం ఉన్న రాయి 24 గంటలు గడవకముందే ఏలా మాయం అయ్యిందనేది అర్ధం కావడం లేదు. ఈ వ్యవహారంపై యాజమాన్యాన్ని వివరణ కోరే ప్రయత్నం చేయగా రేపుమాపు అంటూ పేషంట్ బంధువులను తిప్పుకుంటున్నారని తెలుస్తోంది.
ఫేక్ రిపోర్టుల వెనుక పెద్ద ముఠా
ఇటీవల నల్లగొండ జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ సెంటరుల పనితీరు వివాదస్పదంగా మారింది. ప్రధానంగా రివర్ డయాగ్నస్టిక్ సెంటరులో ఇలాంటి ఫేక్ రిపోర్టులు ఇటీవల కొకొల్లుగా బయటకు వచ్చాయని తెలుస్తోంది. ఇలాంటి ఫేక్ రిపోర్టులను కావాలనే సృష్టిస్తూ పేషంట్ల నుంచి పెద్దఎత్తున డబ్బులు గుంజుతున్నట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారం వెనుక ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించిన పెద్దముఠా చాపకింద నీరులా పనిచేస్తుందని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇదంతా బయటకు తెలిసిన బహిరంగ రహస్యమేనని ఆస్పత్రి వర్గాల్లో చర్చ మొదలయ్యింది. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉన్నా.. వైద్యాధికా రులు మాత్రం డయాగ్నస్టిక్ కేంద్రాల దందావైపు కన్నెత్తి చూడడం లేదు. స్వయంగా పేషంట్లు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం కొసమెరుపు.
గతంలోనూ పెద్దఎత్తున ఆరోపణలు..
నల్లగొండ జిల్లా కేంద్రంలోని రివర్ డయాగ్నస్టిక్ యాజమాన్యంపై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. కిడ్నీ, పిత్తాశయం తదితరాల్లో రాళ్లకు సంబంధించి 10 ఎంఎం సైజు కంటే పెద్దగా ఉంటేనే ఆరోగ్యశ్రీ, హెల్త్ ఇన్సూరెన్స్ తదితర సదుపాయాలకు ఎలిజిబుల్ ఉంటుందని తెలుస్తోంది.
ఆ కారణంగా తక్కువ సైజు ఉన్నా సరే రిపోర్టులో ఎక్కువ సైజు నమోదు చేస్తూ ప్రైవేటు ఆస్పత్రులతో కలిసి కొత్త దందాకు తెర తీసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపైనా లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. వైద్యాధికారులు ఇప్పటికైనా స్పందిస్తారో లేదో వేచి చూడాలి.