17-05-2025 01:27:14 AM
గాంధీనగర్, మే 16: ‘దాయాది పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద క్యాంపులను తుడిచిపెట్టేందుకు భారతీయ వాయుసేనకు కేవలం 23 నిమిషాలు సరిపోయింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్‌కు రుణమా? ఈ నిర్ణయంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మరోసారి పునరాలోచించుకోవాలి.’ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
శుక్రవారం గుజరాత్ రాష్ట్రంలో గల భుజ్‌లోని రుద్రమిత్ర వైమానిక స్థావరాన్ని సందర్శించిన రాజ్‌నాథ్ దాయాదికి తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. అవసరమొచ్చినపుడు ప్రపంచానికి పూర్తి సినిమా చూపిస్తాం. పాక్ ప్రవర్తన మార్చుకుంటుందో లేక మరోసారి దాడులకు బలవు తుందో చూస్తాం.
భారత సైనిక సంపత్తిని ప్రపంచం మొత్తం చూసింది. మన సైనికులు పాక్‌లోని 9 ఉగ్రశిబిరాలను ధ్వంసం చేశారు. ఈ దాడుల ధాటికి పాక్ స్థావరాలు అనేకం ధ్వంసం అయ్యాయి. బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యాన్ని పాక్ స్వయంగా ఒప్పుకుంది. పాకిస్థాన్‌లో ఉన్న ప్రతి మూలకు చేరుకునేందుకు మన వాయుసేనకు సామర్థ్యం ఉంది.’ అని పేర్కొన్నారు.
ఐఎంఎఫ్ పునరాలోచించాలి
తాజాగా పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ 1 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర రుణం మం జూరు చేసిన విషయం తెలిసిందే. తమకు ఏడు బిలియన్ల రుణం మంజూరు చేయాలని పాకిస్థాన్ ఐఎంఎఫ్‌ను కోరగా.. ఐఎం ఎఫ్ సానుకూలంగా స్పందించింది. తాజా నిధులతో పాక్‌కు అందిన నిధులు 2 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి. ‘పాక్‌కు రుణం ఇవ్వడం అంటే టెర్రర్ ఫండింగ్ వంటిదే.
పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ అందించే నిధుల్లో భారతదేశం ఐఎంఎఫ్‌కు అందించే నిధులు కూడా ఉన్నాయి. ఐఎంఎఫ్‌కు భారత్ ఇచ్చే నిధులు పాకిస్థాన్‌లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉగ్ర వాద శిబిరాల మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడటం భారత్‌కు ఇష్టం లేదు. ఉగ్రవాది మసూద్ అజహర్‌కు ఈ నిధుల నుంచి రూ. 14 కోట్ల మేర ఇవ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది.
అత డిని ఐక్యరాజ్యసమితి కూడా ఉగ్రవాదిగా గుర్తించింది.’ అని తెలిపారు. ఈ పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ వాయుసేన సిబ్బందిని ప్రశంసించారు. భుజ్‌లో ఉన్న 2001 భూకంప మృతుల స్మారకాన్ని కూడా సందర్శించారు.