17-05-2025 01:26:34 AM
న్యూఢిల్లీ, మే 16: ఆఫ్గానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమిర్‌ఖాన్ ముత్తాఖీతో.. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఫోన్‌లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్ ప్రభుత్వం ఖండించడాన్ని జైశంకర్ స్వాగతించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్చలతో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్గాన్ మంత్రితో తాను మాట్లాడినట్టు జైశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
తాలిబన్ ప్రభుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వస్థాయి చర్చలు జరపడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ‘అఫ్గాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్‌తో సుహృద్భావ సంభాషణ జరిగింది. పహల్గాం ఉగ్రదాడిని ఆయన ఖండించడం హర్షణీయం. భారత్ మధ్య విభేదాలు సృష్టించేందుకు ఇటీవల అవాస్తవాల ప్రచారం ముమ్మరంగా జరిగింది. దాన్ని తలిబన్ ప్రభుత్వం తోసిపుచ్చడాన్ని స్వాగతిస్తున్నా.
అఫ్గాన్ ప్రజలతో మా స్నేహబంధాన్ని కొనసాగిస్తాం. వారి అభివృద్ధికి నిరంతరం సాయమందిస్తాం’ అని జైశంకర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తాలిబన్ ప్రభుత్వం ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ సంచలన ఆరోపణలు చేసిం ది.
భారత్ ప్రయోగించిన ఓ క్షిపణి అఫ్గాన్ భూభాగంలో పడినట్టు తప్పుడు వార్తలు ప్రచారం చేసింది. దీన్ని కాబూల్ ఖండించిది. తమకు ఎలాంటి హాని జరగలేదని, అదంతా అవాస్తవమేనని తాలిబన్ రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు. అటు న్యూఢిల్లీ కూడా పాక్ ప్రచారాన్ని తిప్పికొట్టింది.