యథేచ్ఛగా ఇసుక దందా

20-04-2024 01:49:24 AM

మామూళ్ల మత్తులో యంత్రాంగం 

ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి

జగిత్రాల, ఏప్రిల్ 19: ఇసుక దందా దళారులకు కల్ప తరువుగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. అక్రమార్కులకు వరంగా మారగా, ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతుంది. జగిత్యాల జిల్లావ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా నిరంతరంగా కొనసాగుతున్నా పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ దళారులు అందినకాడికి దండుకొంటున్నారు. సామాన్యులకు ఇసుక కావాలంటే సవాలక్ష నిబంధనలతో సతమతం అవుతున్నారు. దీంతో అధిక ధరలు చెల్లించైనా దళారులను ఆశ్రయిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక దాదాపు రూ.4 వేల వరకు అమ్ముకొంటున్నారు. అనధికారంగా ఇసుక తవ్వకాలు జిల్లాలో జోరుగానే సాగుతున్నాయి. నదులు ఉన్న ప్రాంతాల్లో ప్రతిరోజు వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా తరలిపోతూనే ఉంది. 

నిబంధనలకు పాతర

అక్రమార్కులు ఇసుక క్వారీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడేస్తున్నారు. వాగులు వంకలను ఇసుక అక్రమ రవాణాకు ఆనువైన మార్గంగా ఎంచుకుంటున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహ ద్దుల్లో ని మంజీర నుంచి ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా  ఝుళిపిస్తున్నట్టు వెల్లడిస్తున్నా.. ఇక్కడికి భారీగానే తరలివస్తుంది. సమీప వాగుల్లోని ఇసుకను ఓ చోటుకు చేర్చి జల్లెడ పట్టి ఫిల్టర్ ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకుంటు న్నారు. ఇసుక అక్రమ రవాణా ఆగకుండా నిరంతరం కొనసాగుతు న్నా.. ‘ఇసుక మాఫియాపై కన్నేశాం, దళారుల ఇసుక దందాకు చెక్ పెడుతున్నాం’ అని అధికారులు మాటలకే పరిమితం అవుతున్నారు. 

శివారులో డంప్‌లు

జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ఆయా జిల్లాల్లో  జిల్లాస్థాయి సాండ్ కమిటీ (డీఎల్‌ఎస్‌ఈ) దరఖాస్తులను పరిశీలించి వ్యవసాయ, గనుల, భూగర్భ, జల, రెవెన్యూ శాఖల ద్వారా క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం ఇసుక తవ్వకాలకు అనుమతులిస్తారు. కానీ, ఇక్కడ అలాంటివి పాటించిన దాఖలాలు కనిపించడం లేదు. జిల్లాకేంద్రం శివారు ప్రాంతాలను అక్రమంగా తరలించిన ఇసుకను దాచుకునే నిలయాలుగా మార్చుకుం టున్నారు. తాము చెప్పిందే ధర అన్నట్టుగా దళారులు చెలరేగిపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నా రు. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటున్నా తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఇసుక కొరత తీవ్రమైంది .

సర్కార్ కాంట్రాక్టర్ల బ్లాక్ దందా  జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జోరుగానే సాగుతుంది. ఇంజినీరింగ్ శాఖల అధికారులను ప్రలోభాలకు గురిచేస్తూ అవసరానికి ఐదారు రెట్లు ఎక్కువగా తెచ్చుకుంటున్నారు. ఇసుక కొరత నెలకొన్నా ప్రభుత్వ పనులకు ఆటంకం కలుగకూడదనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లకే ప్రాధాన్యమిచ్చి అడిగిన దానికన్నా ఎక్కువగా ఇసుకను అందిస్తున్నారు. సర్కార్ పనుల కోసం కేటాయించినా.. మార్కెట్‌లో భారీగానే అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయం పెంపు కోసం అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా అన్ని శాఖలు సమర్థంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.