18-09-2025 01:19:54 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ విద్యా విధానం (తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ) భారతదేశ విద్యా విధానానికి దిక్సూచిలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉన్న వారి దగ్గర జ్ఞానం లేదని... జ్ఞానం ఉన్న చోట భాష లేదని.. రెండు ఉన్న చోట నైపుణ్యాలు లేవని, కానీ ఈ మూడింటి కలబోతగా విద్య ఉండాలని సీఎం సూచించారు.
1 నుంచి 12వ తరగతుల వరకు సమూల మార్పులు రావాలని ఆదేశించారు. రాబోయే 25 ఏళ్లు విద్యావ్యవస్థను దిశానిర్దేశం చేసేలా విద్యావిధానం డాక్యుమెంట్ రూపొందించాలని సూచించారు. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల మెరుగు పరిచేందుకు నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణ విద్యా విధానం నివేదిక రూపకల్పనపై సచివాలయంలో బుధవారం తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, విద్యాకమిషన్, యూనవర్సిటీ వీసీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
15 శాతం మందికే ఉద్యోగావకాశాలు
సరళీకృత ఆర్థిక వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగినా విద్యాప్రమాణాలు ఆ స్థాయిలో పెరగడం లేదన్నారు. దీంతో తెలంగాణం నుంచి ఏటా బయటకు వస్తున్న 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని తెలిపారు. తగినంత నైపుణ్యం లేకపోవడమే అందుకు కారణమన్నారు. అవకాశాలు అందిపుచ్చుకునేలా విద్యా రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
సర్కార్ బడులపై నమ్మకం కల్గించాలి
విద్యా రంగానికి భారీఎత్తున నిధులు కేటాయిస్తున్నా ఏటికేడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 11 వేల ప్రైవేట్ స్కూళ్లలో 34లక్షల మంది విద్యార్థులుంటే, 27వేల ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం 18 లక్షల మంది విద్యార్థులున్నారని తెలిపారు. విద్యాశాఖకు రూ.21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతోందన్నారు.
ప్రైవేటు పాఠశాలలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీతో ప్రారంభిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ప్రారంభమవుతున్నాయన్నారు. నర్సరీకి ప్రైవేటు పాఠశాలలో చేరిన వారు తిరిగి ప్రభుత్వ పాఠశాలల వైపు చూడడం లేదన్నారు. విద్యార్థుల రాకపోకలు, తగిన శ్రద్ధ చూపుతారనే కారణంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారని సీఎం తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలు ఆ రకమైన ధీమా కల్పించగల్గితే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల ల్లోనే చేర్చుతారని.. తెలంగాణ విద్యా విధా నం రూపకల్పనలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సీఎం సూచించారు. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టేలా వారికి ప్రమోషన్లు, బదిలీలు చేశామన్నారు. యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్ల నియామకం చేపట్టామని సీఎం తెలిపారు.
ఉస్మానియా, కాకతీయ విశ్వ విద్యాలయాలు గతంలో సైద్ధాంతిక భావజాలలకు నిలయంగా నిలిచి ప్రజా సమస్యలపై ఆందోళనలు, ఉద్యమాలు చేపట్టేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వ విద్యాలయాల స్థాయి వరకు విద్యా ప్రమాణాలు పడిపోవడం.. నైపుణ్యాల లేమితో ఉద్యోగాలు లభించకపోవడంతో విద్యార్థులు డ్రగ్స్ బారినపడి జీవితాలను కోల్పోతున్నారని సీఎం అన్నారు.