06-09-2025 12:43:39 AM
-తెలంగాణ యువ రాష్ట్రంగా ప్రపంచంతో పోటీపడుతున్నది..
-రాష్ట్రాభివృద్ధికి ఐఎస్‌బీ విద్యార్థులు సహకరించాలి
-ఐఎస్‌బీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణ మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కావాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రతిష్ఠాత్మకంగా ‘తెలంగాణ రైజింగ్- అమలు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో శుక్రవారం ఆయన మోతిలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను ప్రారంభించి మాట్లాడారు. యువ రాష్ట్రంగా తెలంగాణ ప్రపంచంతో పోటీపడుతుందని వివరించారు.
రాష్ట్రాభివృద్ధికి ఐఎస్‌బీ విద్యార్థులు సహకరించా లని పిలుపునిచ్చారు. రాష్ట్రప్రభుత్వం విద్యారంగంపై ఎవరూ ఊహించని రీతిలో పెట్టుబడులు పెడుతున్నదని స్పష్టం చేశారు. విద్యపై పెట్టుబడి రాష్ట్ర నిర్మాణానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఒక్కో క్యాంపస్‌ను 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని వివరించారు.
అలా రాష్ట్రవ్యాప్తంగా 104 పాఠశాలలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు కళాశాల బయటకు వెళ్లగానే ఉద్యోగం పొందేలా స్కిల్ యూనివర్సిటీలో సిలబస్ రూపొందిస్తామని తెలిపారు. స్కిల్ వర్సిటీలో ఎలాంటి సిలబస్ ఉండాలనే అంశంపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి త్వరలో ఒక నిర్ణ యం తీసుకుంటామని స్పష్టం చేశారు. కోఠిలో చాకలి ఐలమ్మ పేరిట మహిళా యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ చైర్మన్ ఆనంద్ మహీంద్రను స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా నియమించుకున్నామని వెల్లడించారు. ఐఎస్‌బీ నిర్వాహకులు స్కిల్ యూనివర్సిటీతోపాటు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను సందర్శించి, రాష్ట్రప్రభుత్వానికి సలహాలు సూచనలివ్వాలని సూచించారు. ఆ సూచనలు రాష్ట్ర భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటాయని ఆకాంక్షించారు. గురుపూజ దినోత్సవం రోజున ఐఎస్‌బీ వంటి గొప్ప విద్యాలయంలో ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభించుకోవడం అభినందనీయమని కొనియాడారు.
రాష్ట్రప్రభుత్వం ఐఎస్‌బీని ఒక విద్యాసంస్థ గానే కాదు, రాష్ట్ర భాగస్వామిగా చూస్తుందని స్పష్టం చేశారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో సెంటర్ ఫర్ ఎనలిటికల్ ఫైనాన్స్ భాగస్వామి అవుతున్నదని వెల్లడించారు. ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ద్వారా విద్యార్థులను కేవలం సీఈవోలుగా మాత్రమే కాకుండా, భారతదేశం గర్వించే విధంగా ప్రజాసమస్యలకు పరిష్కారం చూపే దార్శనికులుగా తీర్చిదిద్దాలని సూచించారు. మోతిలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ డీన్ మదన్ పిల్లుట్ల, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు.