calender_icon.png 30 December, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 252పై అపోహలు వద్దు.. జర్నలిస్టుల సంక్షేమమే మా ధ్యేయం

30-12-2025 11:54:25 AM

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి పై నిందలు తగదు!

జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి

​సంగారెడ్డి, (విజయక్రాంతి): వర్కింగ్ జర్నలిస్టులతో పాటు డెస్క్ జర్నలిస్టులందరికీ బస్ పాస్ లు, హెల్త్ కార్డులు సహా అన్ని సంక్షేమ పథకాలు వర్తిస్తాయని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి స్పష్టం చేశారు. సోమవారం సంగారెడ్డిలో జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ విభాగం నేతలు అనిల్ కుమార్, ఆసిఫ్ లతో కలిసి ఆయన మాట్లాడారు. 252 జీవో ద్వారా 13 వేల అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, తమ ఉనికి చాటుకోవడానికి కొన్ని సంఘాలు పనిగట్టుకొని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

డెస్క్ జర్నలిస్టులను తాము వేరుగా చూడడం లేదని, గతంలో కేవలం కొందరికే కార్డులు ఉండేవని, ఇప్పుడు అందరికీ మీడియా కార్డులు అందేలా తమ సంఘం రాష్ట్ర నాయకత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. ​నానాటికి అడుగంటుతున్న జర్నలిజం విలువలను పెంపొందించేందుకే మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కట్టుదిట్టమైన నిబంధనలతో ఈ జీవో తెచ్చారని, ఆయనపై నిందలు వేయడం సరికాదన్నారు. జీవోలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందే వరకు ఐజేయు పోరాడుతుందని యాదగిరి స్పష్టం చేశారు.