20-08-2025 01:10:49 AM
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): కీలక ఖనిజాల రంగంలో సింగరేణి సంస్థ ‘బంగారు’ అడుగు వేసింది. కర్నాటక రాష్ట్రం దేవదుర్గ్‌లోని బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్‌ను సంస్థ దక్కించుకుంది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో సింగరేణి సంస్థ ఎల్‌బె బిడ్డర్‌గా నిలిచినట్టు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. దీంతో సంస్థకు భవిష్యత్‌లో 37.75 శాతం రాయల్టీ లభిస్తుందని పేర్కొన్నారు.
దీనితో ఖనిజాన్వేషణలో సింగరేణి శుభారంభం చేసినట్టు అయ్యిందన్నారు. ఇతర రంగాల్లోకి సింగరేణిని విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చేసిన ప్రయత్నంలో తొలి విజయాన్ని సాధించామని సీఎండీ పేర్కొన్నారు. రానున్న ఐదేండ్లలో ఈ గనుల్లో అన్వేషణను పూర్తి చేయనున్నట్టు సీఎండీ బలరామ్ స్పష్టం చేశారు.
రూ. 90 కోట్ల ఖర్చుతో అన్వేషణ
త్వరలోనే దేవదుర్గ్‌లో బంగారం, రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో సింగరేణి అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో పరిశోధన మొద లవ్వనుంది. అన్వేషణకు సుమారు రూ. 90 కోట్ల ఖర్చు అవుతుందని, దీనిలో రూ. 20 కోట్లను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది. ఫలితాలపై నివేదిక అందిన తరువాత కేంద్రం ఈ గనులను మైనింగ్ కో సం వేలం వేస్తుంది. ఇతర కంపెనీల మాదిరిగానే సింగరేణికి కూడా ఈ గనులను దక్కించుకోవడానికి అవకాశం ఉంటంది. గనులను దక్కించుకున్న సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీలో 37.75 శాతాన్ని గనిలో మైనింగ్ జరిగినంత కాలం సింగరేణికి చెల్లించాల్సి ఉంటుంది.
మూడు గనుల వేలంలో సింగరేణి
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 13న మొత్తం 13 కీలక ఖనిజాల అన్వేషణ లైసెన్స్‌ల కోసం వేలం ప్రక్రియను ప్రారం భించింది. ఇందులో సింగరేణి పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీంతో అన్వేషణకు అనువైన బ్లాక్స్‌పై సింగరేణి నిపు ణుల బృందాన్ని ఏర్పాటుచేసి అధ్యయం చేశారు. అనంతరం మధ్యప్రదేశ్ పదార్‌లోని ప్లాటినమ్ గ్రూప్ ఎలిమెంట్స్ బ్లాక్, ఏపీలోని చంద్రగిరి వద్ద ఉన్న ఒంటిల్లులోని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ బ్లాక్, కర్నాటకలోని బంగారం, రాగి బ్లాకులు తమకు అనువైనవిగా గుర్తించారు. వీటికోసం ఈనెల 13, 14, 19 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ వేలం నిర్వహించింది. ఇందులో కర్నాటక దేవదుర్గ్‌లోని బంగారం, రాగి బ్లాక్‌లకు సంబం ధించిన అన్వేషణ లైసెన్సును సింగరేణి దక్కించుకుంది.
సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు
దేవదుర్గ్‌లోని బంగారం, రాగి బ్లాక్‌లలో అన్వేషణ లైసెన్స్‌ను సింగరేణి దక్కించుకోవడంపై సీఎ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. లైసెన్స్‌ను వేలంలో దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కీలక ఖనిజాల అన్వేషణలోనూ దేశంలో అగ్రగామి సం స్థగా నిలుస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తంచేశారు. రానున్న రోజు ల్లో సింగరేణి అంతర్జాతీయ సంస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఇదే స్ఫూర్తితో ముందకు వెళ్లాలని సంస్థ సీఎండీ బలరామ్, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
రూ.25,000 కోట్ల ఆదాయార్జన దిశగా..
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): కర్ణాటకలోని దేవదుర్గ్‌లోని బం గారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ పొందేందుకు సింగరేణి యాజమాన్యం ఉవ్విళ్లూరుతున్నది. ఒకవేళ లైసెన్స్ వస్తే సంస్థ దీర్ఘకాలంలో సుమారు రూ. 25,000 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం సింగరేణి టర్నోవర్‌లో సుమారు మూడో వంతు కావడం గమనార్హం.
అందుకే సీఎండీ ఎన్ బలరాం నిపుణుల బృందాన్ని ప్రత్యేక పురమాయించి, అధ్యయనంలో వెల్లడైన అంశాలను లోతుగా విశ్లేషించారు. తర్వాత ఆన్‌లైన్ వేలంలో పాల్గొని ఎల్-1గా నిలిచారు. దీంతో బంగారం, రాగి గనులు నడిచినంత కాలం 37.75 శాతం రాయల్టీగా ఆదాయంగా వస్తూనే ఉంటుంది.
ఇలా రాయల్టీగా వచ్చే ఆదాయమే రూ.వేల కోట్ల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేవదుర్గ్ ప్రాంతం బంగారం, రాగి గనులకు ప్రసిద్ధి. దీనికి 50 కి.మీ దూరంలోనే కోలారు బంగారు గని ఉన్నది. ఆ నమ్మకంతోనే సింగరేణి ముందుకు సాగుతున్నది. నిపుణులు, ప్రభుత్వ సూచన మేరకే సీఎండీ బలరాం ఆన్‌లైన్ వేలంలో పాల్గొనాలనే నిర్ణయం తీసుకున్నారు.
మైనింగ్ కూడా చేతికి వస్తే..
ఐదేండ్ల పాటు రూ.90 కోట్లు ఖర్చుచేసి, అన్వేషణ పూర్తయిన తర్వాత కేంద్రం దేవదుర్గ్ బంగారు, రాగి గనులను మైనింగ్ చేయడానికి వేలం వేస్తుంది. వేలంలో సింగరేణి గనులను దక్కించుకుంటే, ఇక సంస్థ వెనక్కిచూసుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు గనుల ద్వారా వచ్చే ఆదాయం రూ.25,000 కోట్లు మించిపోతుందని నిపుణుల అంచనా. సింగరేణి యాజమాన్యం ఇదే వ్యూహంతో ముందుకు సాగుతున్నది.