10-05-2025 01:37:59 AM
పాక్ ప్రధానిని విమర్శించిన పీటీఐ ఎంపీ షాహిద్ అహ్మద్
లాహోర్, మే 9: ఆపరేషన్ సిందూర్ దాడుల తో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏం చేయాలో తెలియక అక్కడి నేతలు తలలు పట్టుకుంటున్నా రు. ఈ నేపథ్యంలో తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ, అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పీటీఐ ఎంపీ షాహిద్ అహ్మద్ పార్లమెంట్‌లో ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై విరుచుకుపడ్డాడు. ‘మా ప్రధాని ఓ పిరికివాడు. మోదీ పేరు పలికేందుకే భయపడుతున్నాడు.
సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే అవి పోరాడలేక ఓడిపోతాయి. సైనికులు ధైర్యంగా పోరాడుదామని అనుకున్నా ప్రధానికే ధైర్యం లేకపోవడంతో వారు కూడా ముందడుగు వేయలేకపోతున్నారు. భారత్ దాడికి దిగి రోజులు గడుస్తున్నా ప్రధాని ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం దారుణం.’ అని విమర్శించారు.
దేవుడా నువ్వే కాపాడాలి
పాక్ పార్లమెంటులో ఓ సభ్యుడు ప్రవర్తించిన తీరు పాకిస్థాన్ దుస్థితికి అద్దం పడుతోంది. ఎంపీ మేజర్ తాహిర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘పాక్ బలహీనంగా ఉంది. పాక్‌ను కాపాడాలని మనమంతా ఆ దేవుడిని ప్రార్థిద్దాం’ అని వ్యాఖ్యానించారు. దేవుడి దయ ఉండాలని, శత్రువును ఓడించే బలం ఇవ్వమని ప్రార్థించారు.