calender_icon.png 5 September, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

విజృంభిస్తున్న విషజ్వరాలు

01-09-2025 01:10:26 AM

-వాతావరణ మార్పులు, నిల్వ నీటితో వ్యాధుల వ్యాప్తి 

-చాపకింద నీరులా విస్తరిస్తున్న డెంగ్యూ వైరస్ 

-జ్వరం, జలుబు, విరేచనాలతో బాధపడుతున్న ప్రజలు 

-జ్వరాల సీజన్ వచ్చింది.. భద్రం అంటున్న వైద్యులు 

ఎల్బీనగర్, ఆగస్టు 31 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజలు విషజ్వరాలతో మంచం పడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒక్కరు జ్వరం, విరేచనాలు, ఒంటి నొప్పులు, చలిజ్వరంతో బాధపడుతున్నారు. వాతావరణంలో మార్పులు, వర్షపు నీరటి నిల్వలు, నీటి కాలుష్యంతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.

శీతాకాలం రాకముందే సీజనల్ జ్వరాలు ఎక్కువవుతున్నాయి. వర్షాలు వచ్చి, తగ్గిన తర్వాత ఉన్న పొడి వాతావరణంలో పలు రకాల వైరస్లు పెరిగి అనేక జ్వరాలకు దారి తీస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా డెంగ్యూ, ఇన్ఫ్లూయెంజా, చికున్ గున్యా, టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో జ్వర బాధితులు అధికంగా చికిత్స తీసుకుంటున్నారు.

వేసవి కాలంలో కంటే ఇప్పుడు అన్ని రకాల దవాఖానల్లో ఓపీ(ఔట్ పేషెంట్) సంఖ్య పెరిగింది. బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానల్లో జ్వరాలు, వైరల్ ఫివర్ తో బాధపడుతున్నవారితో రద్దీగా ఉంటున్నాయి.   

వనస్థలిపురంలోని ఏరియా ప్రభుత్వ దవాఖాన, సరూర్ నగర్, హయత్ నగర్ లోని కమ్యూనిటీ హాల్త్ సెంటర్లు, మన్సూరాబాద్ లోని పట్టణ అర్బన్ ఆరోగ్య కేంద్రం, ఇతర ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో గతంలో కంటే 15 నుంచి 25శాతం ఓపీ పెరిగినట్లు ఆయా దవాఖానల వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, జ్వర లక్షణాలు గమనించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వెలుగులోకి వస్తున్న డెంగ్యూ జ్వరం 

వర్షాలు వస్తూ, తగ్గుతూ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పలు రకాల జ్వరాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇన్ఫ్లూయెంజా, డెంగ్యూ, చికున్ గున్యా తదితర వైరల్ ఫివర్ కనిపిస్తున్నాయి. వీటి లక్షణాలు కూడా విభిన్నంగా కనిపిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. డెంగ్యూ జ్వరం వస్తే చేతులు, కాళ్ల నొప్పులు, ప్లేట్లెట్లు పడిపోవడం లక్షణాలు ఉంటాయి.

కానీ, ఇప్పుడు వస్తున్నవాటిలో ముందుగా విరేచనాలు అవుతున్నాయి, ఒకటి, రెండు రోజుల తర్వాత జ్వరం వచ్చి, అప్పుడు శరీరంలో ప్లేట్లెట్లు పడిపోతున్నాయి. ఇన్ఫ్లూయెంజా కేసులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి దవాఖానలో మూడు నుంచి ఐదు డెంగ్యూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే చికన్ గున్యా కేసులూ విజృంభిస్తున్నాయి.

నీటి నిల్వలు, కాలుష్యంతో వైరస్ వ్యాప్తి 

వాతావరణ మార్పులు, వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, నీటి కాలుష్యం, అపరిశుభ్రమైన పరిసరాలతో వైరస్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి.  వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో అలర్జీలు లేదా సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) తదితర లక్షణాలు ఉన్నవారికి వైరల్ ఫివర్ సమస్య చాలా తీవ్రంగా వస్తోంది. వాయు కాలుష్యంతో తీవ్రమైన దగ్గు, ఆయాసంతో బాధపడుతున్నారు. కొందరిలో తీవ్రమైన జ్వరంతోపాటు ఊపిరితిత్తుల సమస్య వేధిస్తుంది.

ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి 

 జ్వరం రాకముందే ఫ్లూ టీకాలు, క్వాడ్రలెంట్ టీకాలు (వైరస్లపై పోరాడేవి) తీసుకోవాలి. ఆయా టీకాలు సామర్థ్యం 6-8 నెలల పాటు పనిచేస్తుంది. కానీ, తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏడాది వరకు పని చేస్తాయి. రద్దీ ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి. ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఎయిర్ ఫిల్టర్లు అమర్చుకోవాలి.

రోజూ తప్పనిసరిగా కాచి, చల్లార్చిన నీటిని ఆరేడు గ్లాసుల వరకు తాగాలి. వేడి చేసి చల్లార్చి నీటిని గాజు లేదా స్టీలు సీసాలో పోసుకుని తాగాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు వాడకాన్ని మానేయాలి. బయటి ఆహారం వీలైనంత వరకు మానుకోవాలి.  వేడిగా ఉన్న, తాజా ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. రద్దీ ప్రాంతాలకు వెళ్లడాన్ని తగ్గించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలి. తినేముందు చేతులు శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

- జ్వరం వచ్చిన రోజే దవాఖానకు వెళ్లాలి చాలామంది జ్వరం వచ్చిన రెండు, మూడు రోజలు ఇంటి వద్దే ఉండి, మెడికల్ షాపులో టాబ్లెట్లు వేసుకుని తగ్గకపోతే అప్పుడు దవాఖానకు వస్తున్నారు. తీవ్రమైన జ్వరం వస్తే తగిన పరీక్షలు చేయడానికి సమయం ఉండదు. సీజన్లో వచ్చే జ్వరాలకు వెంటనే వైద్యులను సంప్రదించాలి.  డెంగ్యూ, చికున్ గున్యా, ఇన్ఫ్లూయెంజా తదితర వేర్వేరు రకాల సమస్యలకు వేర్వేరుగా మందులు వాడాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు.

జ్వర బాధితులు అధికంగా వస్తున్నారు

వనస్థలిపురంలోని ఏరియా ప్రభుత్వ దవాఖానకు వైరల్ ఫివర్, ఇతర జ్వరాలతో బాధపడే వారు అధికంగా వస్తున్నారు. సీజనల్ వ్యాధులు జులై నెలలో కంటే ఆగస్టు నెలలో అధికంగా విస్తరిస్తున్నాయి. సాధారణంగా వానాకాలం ప్రారంభంలోనే సీజనల్ వ్యాధులు వస్తాయి, కానీ, ఈసారి వర్షాలు పడిన తర్వాత వస్తున్నాయి.

గతంలో దవాఖానకు ప్రతి రోజూ 200 నుంచి 250 మంది ఔట్ పేషెంట్లు వస్తే... ఇప్పుడు 300 నుంచి 350 మంది వస్తున్నారు. కనీసం 20 నుంచి 30 శాతం ఓపీ పెరిగింది. ప్రతి రోజూ మూడు నుంచి ఐదు డెంగ్యూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలు భయాందోళనకు గురికావొద్దు, సకాలంలో చికిత్స తీసుకుంటే త్వరగా కొలుకోని, ఆరోగ్యంగా ఉండొచ్చు.

- డాక్టర్ కృష్ణ, వనస్థలిపురం ఏరియా ప్రభుత్వ దవాఖాన.