01-09-2025 01:16:01 AM
యూరియా కోసం తప్పని తిప్పలు
మహబూబాబాద్, ఆగస్టు ౩౧ (విజయక్రాంతి):ఒక్క బస్తా యూరియా కోసం అన్నదాతలు రోజులకొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో యూరియా కోసం అన్నదాతలు అర్ధరాత్రి పూట క్యూలో నిలబడి నానా అగచాట్లు పడ్డారు. సోమవారం ఉదయం రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులకు టోకెన్లు జారీ చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం ఏర్పాట్లు చేశారు. రైతుల రద్దీ దృష్ట్యా ఇబ్బంది కలగకుండా పురుషులకు, మహిళలకు వేర్వేరుగా భారీకేడ్లు ఏర్పా టు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న రైతు లు ఆదివారం రాత్రి 9 గంటల నుంచే రైతు వేదిక వద్దకు తరలివచ్చారు. రాత్రి 11 గంట ల సమయంలో సుమారు 300 మందికి పైగా రైతులు అక్కడికి చేరుకున్నారు. రైతు వేదిక వద్ద కటిక చీకట్లోనే అవస్థలు పడు తూ, ఓవైపు వర్షం వస్తున్నా లెక్కచేయకుం డా నిద్రించారు. యూరియా కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. కేసముద్రం ఎస్‌ఐ మురళీధర్‌రాజ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
యూరియా కోసం అవే ఇబ్బందులు
మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం ప్రతి ఒక్క రైతు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు తమ గ్రామం నుంచి మండల కేంద్రానికి రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. నాలుగు రోజుల క్రితం జిల్లాలోని నర్సింహులపేటలో రైతులు యూరియా కోసం తిరిగి తిరిగి వేసారి శనివారం రాస్తారోకో నిర్వహించగా, టోకెన్లు ఇచ్చి పంపారు.
శనివారం టోకెన్లు పొందిన రైతులకు ఆదివారం యూరియా ఇస్తారనుకొని ఎంతో ఆశతో ఆదివారం వస్తే టోకెన్లు తీసుకొని, రైతులకు కూపన్లు చేతిలో పెట్టారు. రైతు వేదిక వద్దకు వందల మంది రైతులు చేరుకోగా యూరియా రాలేదని చెప్పడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీనితో రైతులకు ఈరోజు కూపన్లు ఇస్తామని చెప్పి శాంతపరిచారు.
చెల్లాచెదురైన ఆధార్‌కార్డులు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ సొసైటీ వద్దకు శనివారం పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం తరలి వచ్చారు. యూరి యా టోకెన్ల జారీ కోసం రైతుల నుంచి ఏఈఓలు ఆధార్‌కార్డు, పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ ప్రతులను స్వీకరించారు. సోమవారం రైతులకు టోకెన్లు జారీ చేస్తామని క్యూలో నిల్చోవాల్సి ఉంటుందని అధికారు లు చెప్పడంతో,
దీనికి ఆగ్రహించిన రైతులు ఇప్పుడు తీసుకునే పత్రాల ప్రకారం టోకెన్లు జారీ చేయాలని, మళ్లీ క్యూ అంటే ఎలా అంటూ నిలదీశారు. ఈ క్రమంలో కొందరు తోపులాడుకోగా టేబుల్‌పై సేకరించి పెట్టిన ఆధార్ కార్డులు, పట్టా పాస్ పుస్తకాల జిరాక్స్ ప్రతులు చెల్లాచెదురయ్యాయి.
కొల్చారంలో టోకెన్లు మాయం
మండల కేంద్రమైన కొల్చారంలోని సహకార సంఘంలో సహకార సంఘం సభ్యులు, సిబ్బంది కలిసి 350 టోకెన్లను మాయం చేసి తమకు నచ్చిన వారికి ఇచ్చారని రైతులు ఆరోపించారు. రంగంపేట, కొల్చారం సొసైటీకి 550 బస్తాల చొప్పున మొత్తం 1100 యూరియా బస్తాలు వచ్చాయి.
అయితే కొల్చారంలో 350 టోకెన్లు మాయం కాగా, కేవలం 200 టోకెన్లు మాత్రమే రైతులకు పంపిణీ చేశారు. దీంతో రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి వ్యవసాయ అధికారులు నిలదీయడంతో గందరగోళం నెలకొంది. దీంతో వ్యవసాయ అధికారి శ్వేత కలుగజేసుకుని టోకెన్ల అవినీతికి పాల్పడ్డ వారిపై చీటింగ్ కేసు చేస్తామని తెలిపారు.
యూరియా కోసం రైతుల కొట్లాట
మెదక్(విజయక్రాంతి): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి సహకార సంఘం వద్ద ఉదయం 6 గంటల నుండి లైన్‌లో నిలబడగా 10 గంటలకు టోకెన్‌లు అధికారులు తెలపడంతో రైతులు చెప్పులు వరుసలో పెట్టి నిలబడ్డారు. కానీ రైతులకు ఒకరికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తానని తెలపడంతో ఆవేదన వ్యక్తం చేశారు.
సొసైటీకి కేవలం 450 బస్తాలు రావడం అక్కడ వరుసలో నిలబడిన దాదాపు 800 మంది రైతులలో సగం మందికి మాత్రమే రావడంతో మిగతా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గోదాంలో యూరియా కోసం రైతుల మధ్య కొట్లాటలు, తోపులాటలు జరిగాయి.