29-08-2025 04:38:53 AM
రాజపేట యాదగిరిగుట్ట మధ్య రాకపోకలు బంద్
యాదగిరిగుట్ట ఆగస్టు 27(విజయ క్రాంతి): యాదగిరిగుట్ట రాజపేట మండలం మధ్యగల అతిపెద్ద వాగు పొట్టి మరి వాగు ఇది ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తుంది. సుమారు 300 మీటర్లు గల వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాలు అక్కడి కక్కడే నిలిచిపోయాయి. రాజపేట మండలం పొట్టి మరి వద్దగల శ్రీ చిన్మయానంద ఆశ్రమం ఆనుకొని ఉన్న పొట్టిమరి వాగు ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తుంది దీనివల్ల రాజపేట మండలం కాల్వపల్లి నుండి యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి మధ్య వాగు వలన రాకపోకలు నిలిచిపోయాయి.
10 సంవత్సరాల తర్వాత ఇంత భారీగా ప్రవహించడం జరిగిందని స్థానికులు తెలుపుతు న్నారు. అతి పెద్ద వాగును ప్రభుత్వం చర్వ తీసుకుని మరమ్మత్తులు చేయాలని సూచిస్తున్నారు. ఇంతకుముందు ఇదే వాగులో సాధారణ స్థాయిలో ప్రవహిస్తున్నప్పుడు ఇద్దరు స్త్రీలు వాగులో కొట్టుకుపోయి మరణించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగు చర్యలు పాటించాలని కోరుతున్నారు.
బిక్కేరు వాగు ఉధృతం, ఆలేరు కొలనుపాక రాకపోకలను నిలిపివేత...
ఆలేరు, ఆగస్టు 28 (విజయ క్రాంతి): ఆలేరు మండలంలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడడంతో మండలంలోని చెరువులు కుంటలు నిండి అలుగులు పోస్తున్నాయి. గంధముల చెరువు నిండి అలుగు పోయడంతో బిక్కేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది, అందుకుగాను గతంలో పలువురు ద్విచక్ర వాహనం దారులు వాగులో పడి గాయాల పాలు అయినారు ఒకరిద్దరు కూడా మరణించారు దానిని దృష్టిలో పెట్టుకుని బుధవారం సాయంత్రం ఆలేరు నుండి కొలనుపాక వెళ్లే మార్గమును అధికారులు మూసివేసి నలుగురు పోలీసు సిబ్బందిని అక్కడ కాపలాగా ఉంచారు.
రహదారి మూయడంతో కొలనుపాక, రాఘవాపురం, లక్ష్మక్కపల్లి, సోమవారం, బొంధుగుల, దూది వెంకటాపురం, పారుపల్లి, కురారం, జాల, రాజాపేట, బచ్చన్నపేట ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు., హైదరాబాదు నుండి బచ్చన్నపేటకు వెళ్లే బస్సులు ఆలేరు బస్టాండ్ లో దిగుతున్నారు. ఆలేరు నుండి జనగామ వెళ్లి సిద్దిపేట బస్సులో బచ్చన్నపేటకు వెళ్తున్నారు.
ఎమ్మెల్యేలు కుంభం, బిర్లా, కలెక్టర్ పరిశీలన
యాదాద్రి భువనగిరి ఆగస్ట్ 28 ( విజయ క్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో మూసి, బిక్కేరు నదులతో పాటు. పొట్టి మరి వాగు ఉదృతంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వలిగొండ మండలం సంగం బొల్లేపల్లి మధ్య గల లో లెవెల్ బ్రిడ్జిపై నుండి మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భువనగిరి చౌటుప్పల్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. మూసీ నది రెండు వైపులా పోలీసులు కాపలా ఉండి ఎవరిని కూడా అనుమతించడం లేదు.
భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి కల్వర్టు వద్ద వరద నీరు రోడ్ లెవెల్ పై నుండి భారీగా ప్రవహిస్తుండడంతో రాత్రి నుండి పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. భువనగిరి నల్లగొండ రహదారిపై లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. పోలీసులు ఎవర్ని కూడా అనుమతించడం లేదు. ఆలేరు వద్ద బిక్కీర్ వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నడంతో దాదాపు 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జనగాం బచ్చన్నపేట కు వెళ్లే ప్రజలు సుదూర ప్రాంతాల నుండి తిరిగి వెళుతున్నారు. ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట రాజాపేట మండలం మధ్యగల పొట్టి మరి వాగు ఉదృతంగా ప్రవహించడంతో కాల్వపల్లి యాదగిరిగుట్ట గౌరాయపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వివిధ గ్రామాల ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి నాగిరెడ్డిపల్లి వాగును ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిశీలించారు.
కల్వర్టును త్వరలో పెద్ద ఎత్తున మరమ్మతులు చేపట్టి వరద నీరు రోడ్డుపైకి రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ హనుమంతరావు అధికారులు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. బిక్కెరు, పొట్టి మర్రి వాగులను ఆలేరు ఎమ్మెల్యే బీర్లు అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావు పరిశీలించి అధికారులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు.
ప్రజలందరూ కూడా ప్రవహిస్తున్న వాగులను నదులను దాటడానికి ప్రయత్నం చేయకూడదని సూచించారు. ఆర్టీసీ బస్సులు గ్రామాలకు వెళ్లే సమయంలో వాగులు ప్రవహించినట్లయితే ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని కలెక్టర్ ఆదేశించారు.