calender_icon.png 29 August, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనం అల్లాడుతుంటే మూసీపై సీఎం రివ్యూలా?

29-08-2025 04:44:04 AM

  1. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ వరదలు
  2. బాధితులకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

గంభీరావుపేట, ఆగస్టు 28 (విజయక్రాంతి): ప్రజలు వరదలతో కష్టాలు పడు తుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రోమ్ నగరం కాలిపోతుంటే ఫిడేల్ వాయించి న చక్రవర్తిలా వ్యవహరిస్తున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం సిరిసిల్ల జిల్లాలోని నర్మాల గ్రామంలో వరద ప్రవాహంలో కొట్టుకు పోయిన నాగయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ర్టం విపత్తులో ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం మూసీ నది సుందరీకరణ, రాష్ట్రానికి ఒలింపిక్స్ తేవడంపై దృష్టి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మూసీ సుందరీకరణపై రివ్యూ అవసరం లేదన్నారు. వరదలపై రివ్యూ చేసి ఆస్తి, పంట, ప్రాణ నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. వెంటనే రాష్ర్ట ప్రభుత్వం ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకు రూ. 25 లక్షల నష్టపరిహారం, ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఎకరాకు రూ.20 వేలు అందించాలని డిమాండ్ చేశారు.

వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేయకపోవడం వల్లనే ఇలాటి పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు. నర్మాలలో వరద ఉధృతి గురించి రైతులకు సమాచారం లేకపోవడం వల్లనే వరదలో చిక్కుకుపోయారని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు హెలికాప్టర్ పంపించి బాధితులను కాపాడామని గుర్తుచేశారు.

ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్‌లు బీహార్ ఎన్నికల్లో, ఇంకా ఎక్కడెక్కడో తిరుగుతున్నాయని, సామాన్యులకు మాత్రం అందుబాటులో లేవని మండిపడ్డారు. ఇంతకుముందు ఖమ్మంలో కూడా వరదలు వస్తే హెలికాప్టర్ పంపలేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొవాలని ఆయన హెచ్చరించారు.