29-08-2025 10:04:18 AM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికలు(Cement Company Elections) శుక్రవారం పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి. బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ నేతృత్వంలో మందమర్రి, తాండూర్ సిఐలు దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ వద్ద భారీగా పోలీసులను మోహరించి బందోబస్తు చేపట్టారు. కార్మిక శాఖ నియమ నిబంధనల(Labor Department Rules and Regulations) ప్రకారం ఉదయం 7 గంటలకు కంపెనీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8:00 వరకు కేవలం 18 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
మరో అరగంట వ్యవధిలోనే మొత్తం 25 ఓట్లు పోలయ్యాయి. 9 గంటల ప్రాంతంలో ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (తరాజు) గుర్తు నుండి పోటీలో నిలిచిన సత్యపాల్ రావు క్యాంపులో కొనసాగుతున్న కార్మికులు మూడు బస్సుల్లో దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసి లోకల్ ఓరియంట్ సిమెంట్ ఎంప్లాయిమెంట్ వర్కర్స్ యూనియన్ (పెద్దపులి గుర్తు) అభ్యర్థి విక్రం రావు వర్గీయులు వారిని కంపెనీ గేటు వద్దనే అడ్డుకొని ఆందోళనకు దిగారు. దీంతో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ పోలీసులతో అక్కడికి చేరుకొని పోలీసు బందోబస్తు మధ్య కార్మికులను కంపెనీలోకి తరలించారు. దీంతో ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఒక్కసారిగా ఓట్ల పోలింగ్ ఊపందుకుంది.