03-11-2025 12:40:23 AM
హన్వాడ, నవంబర్ 2: ప్రతి కుటుంబంలో సొంత ఇల్లు ప్రథమ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్వాడ మండలం పెద్ద దర్పల్లి గ్రామానికి చెందిన ఉప్పరి మల్లమ్మ కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో, గుడిమల్కాపురం గ్రామంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కింద మంజూరైన రూ 30 లక్షలతో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆమెకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు అనేది ఇటుకల కట్టడం కాదు, ఒక కుటుంబానికి భద్రమైన భవిష్యత్తు, గౌరవప్రదమైన జీవితం. పేదల కలలను సాకారం చేయడం మా ప్రభుత్వ ధ్యేయం అని ఆయన చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ హామీని అమలు చేయలేదని, డబుల్ బెడ్రూమ్ అంటూ ఓట్లు దండుకున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, అర్హులందరికీ ఇళ్లు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ప్రజల నమ్మకానికి తగిన విధంగా పనిచేస్తూ, గ్రామాల అభ్యున్నతి, పేదల సంక్షేమానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణయ్య, డీసీసీ కార్యదర్శి టంకర కృష్ణయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వి. మహేందర్, దేవేందర్, విజయ్ నాయక్, చెన్నయ్య, రామస్వామి గౌడ్, శ్రీరామ్ గౌడ్, పల్లెమోని రమేష్, చిన్న యాదయ్య గౌడ్, మారుతి, భీమేష్, రాజు గౌడ్, నర్సింలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.