07-11-2025 07:12:49 PM
ఇన్చార్జి కలెక్టర్ ను కలిసి మాజీ జెడ్పిటిసిల వినతి
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో అక్రమాల చోటు చేసుకుంటున్నాయని వెంటనే అరికట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విక్టర్ ను శుక్రవారం మాజీ జెడ్పిటిసిలు కలిసి వినతిపత్రం అందజేశారు. మార్క్ పేడ్ ద్వారా మొక్కజొన్నలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఇంతవరకు ఎక్కడ కూడా కాంటాలు చేయడం లేదని వెంటనే వారి ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ద్వారా కాంటాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం 16% రాగా అదే రైస్ మిల్లులవద్దకు వెళ్లగానే 19 శాతం ఉందని ప్రతి లారీకి రైతుల వద్ద నుండి 8 నుంచి 10కింటల వడ్లను రైస్ మిల్లర్ దోపిడి చేస్తున్నారని వారు జాయింట్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కొనుగోలు సెంటర్లో ఉన్న తేమశాతం మిషన్ రైస్ మిల్లర్ వద్ద ఉన్న తేమ శాతం మిషన్ అధికారులు పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు.
సదాశివ నగర్ మండలం పద్మాజివాడి సింగిల్ విండో పరిధిలో భూంపల్లి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ ఇంతవరకు కొనుగోలు చేయడం లేదని ఇంచార్జ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యపై తాను ఎఫ్ సి ఐ, మార్క్ పేడ్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ ను కలిసిన వారిలో నాగిరెడ్డిపేట, సదాశివ నగర్, మాజీ జెడ్పిటిసిలు మనోహర్ రెడ్డి, పడిగెల రాజేశ్వరరావు, గాంధారి మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు వజీర్ శివాజీ రావు పాల్గొన్నారు.