7 August, 2026 | 2:28 AM

రూ.500 కోట్ల ధాన్యం స్కాం!

07-08-2026 12:00 AM
  1. రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం 
  2. అక్రమాలపై సమగ్ర విచారణ చేయండి
  3. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
  4. సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు లేఖ

 హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి) : ‘రూ.500 కోట్ల విలువైన దాదాపు 90 వేల టన్నుల ధాన్యం అక్రమ మళ్లింపు వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం లెక్కలు తేల్చేందుకు  సమగ్ర, పారదర్శక విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు అప్పగించిన వేల టన్నుల ధాన్యం కనిపించకపోవడం, ప్రభుత్వం చేరాల్సిన బియ్యంగా తిరిగి రాకపోవడంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. 2023 నుంచి  మిల్లర్లకు సరఫరా చేసిన ధాన్యం, ప్రభుత్వానికి అందిన బియ్యం పరిమాణం మధ్య వ్యత్యాసం పెరుగుతుందని, ఈ పరిణామాలు రైతులు, ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయన్నారు.

ధాన్యం కొనుగోలు వ్యవస్థ రైతుల జీవనోపాధికి కీలకమైనదని,  ధాన్యం మళ్లింపు లేదా దుర్వినియోగం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం కలగడమే కాకుండా రైతుల్లో ప్రభుత్వంపై విశ్వాసం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే జరుపుతున్న దర్యాప్తును కూడా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని కోరారు.

ఈ అక్రమ దందాలో ఎవరి ప్రమేయం ఉన్నా, వారి హోదా, రాజకీయాలతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు అలాగే ధాన్యం కొనుగోలు, రవాణా, నిల్వ, కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియల్లో పటిష్టమైన పర్యవేక్షణ, జవాబుదారీతనాన్ని పెంచే విధంగా వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, ప్రభుత్వ నిధులను కాపాడేందుకు ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి అవసరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.