భారత్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడే
న్యూయార్క్: ప్రపంచకప్‌లో టీమిండియాతో మ్యాచ్ అంటే ఒత్తిడి సహజమే అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈ నెల 9న ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్న నేపథ్యంలో బాబర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ కూడా దీని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏ మూల భారత్, పాకిస్థాన్ తలపడ్డా.. దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతంది. మరి అంత ఎక్కువ అంచనాలు ఉండే మ్యాచ్‌లో ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది. మైదానంలో ప్రశాంతంగా ఉంటేనే ఫలితాలు సాధించగలం. నైపుణ్యంతో పాటు కఠోర శ్రమను నమ్ముకుంటే విజయం సాధ్యం. మా జట్టు అన్ని రంగాల్లో సమతూకంగా ఉంది. గత ప్రపంచకప్‌లో ఫైనల్లో పరాజయం పాలయ్యాం. ఈ సారి మెరుగైన ప్రదర్శనతో కప్పు సాధించాలనుకుంటున్నాం’ అని బాబర్ అన్నాడు.






