calender_icon.png 1 May, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకిస్థాన్, కాంగ్రెస్ నేతల ఆలోచనలు ఒక్కటే!

30-04-2025 01:22:28 AM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): పహల్గాం ఘటన తర్వాత పాకిస్థాన్‌తో యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయంలో బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ.. పాకిస్థాన్ ఉగ్రవాదులు మాట్లాడుతున్న భాషలో మాట్లాడుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం లేఖను విడుదల చేశారు. పాకిస్థాన్ మంత్రు లు, కాంగ్రెస్ పార్టీ నేతల ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయంటూ విమర్శించారు.

కాంగ్రెస్ నేతలు చేసిన ట్వీట్లను పాకిస్థాన్ రీట్వీట్ చేయడం చూస్తుంటే వీరిద్దరి మధ్య ఉన్న అక్రమ స్నేహబంధానికి అద్దం పడుతోందన్నారు. ప్రధాని మోదీ చిత్రంలో తల ను తొలగించి ‘గాయబ్’అని పోస్టు చేయడం కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల పేరుతో రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పి ఎక్కడెక్కడకి గాయబ్ అవుతారో దేశప్రజలందరికీ తెలుసన్నారు.

పహల్గాం ఘటన తర్వాత ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ సైన్యానికి అండగా ఉండాల్సిన బాధ్యతను మరిచిన కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల భాషలో మాట్లాడుతుండటం హేయమైనచర్యఅని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చెప్పినట్లు పాకిస్తాన్ నడుస్తోందా.. లేక పాక్ చెప్పినట్లు కాంగ్రెస్ వ్యహరిస్తోందా అన్న అనుమానం కలుగుతోందని తెలిపారు.

ప్రధానమంత్రికి లేఖ రాసి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించాలని రాహుల్‌గాంధీ కోరుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దేశ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసేలా వ్యవహరించడం వారి మానసిక స్థితికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు. దేశం పట్ల, దేశంలోని వ్యస్థల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అగౌరవ భావానికి ఇది నిదర్శనమన్నారు.

ఉగ్రదాడి జరిగిందని తెలియగానే హోం మంత్రి అమిత్‌షాను ప్రధాని మోదీ పహల్గాంకు పంపారని, తన విదేశీ పర్యటన నుంచి మధ్యలోనే వెనుదిరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదీ దేశంపట్ల మోదీకి ఉన్న అంకితభావానికి నిదర్శనమన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించా లని కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ ద్వారా సూచించారు.