ప్రజాస్వామ్యానికి పంచాయతీలే పునాది
సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ గౌడ్
నూతనకల్, ఏప్రిల్ 24:గ్రామ పంచాయతీలు బలంగా ఉన్నప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ప్రజాస్వామ్యానికి గ్రామ పంచాయతీలే అసలైన పునాదులని మండల పరిధిలోని మిర్యాల గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మిర్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
‘గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని,కేవలం నిధులతోనే కాకుండా, ప్రజల సహకారంతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజకీయ విభేదాలకు తావు లేకుండా, పార్టీలకతీతంగా ప్రజలందరూ ఒకే తాటిపైకి వచ్చి సహకరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీరు మరియు మౌలిక వసతుల మెరుగుదలలో గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల అవిలయ్య,పంచాయతీ కార్యదర్శి అనిల్,వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






