12-01-2026 02:37:40 AM
అక్రమ వ్యాపారులకు అడ్డగా పార్కింగ్ స్థలం
అధికారులపై రైతుకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆగ్రహం
గుడిమల్కార్ మార్కెట్ ఆకస్మికంగా తనిఖీ
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): గుడి మల్కాపూర్ మార్కెట్‌లో కూరగాయల, పూలమార్కెట్ నిర్వహణపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్‌లో రైతు ల కంటే దళారులే ఎక్కువగా వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్ అధికారులు అక్రమ లైసెన్స్‌లు ఇచ్చిన విషయాన్ని గుర్తించిన కమిషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆదివారం గుడిమల్కాపూర్ మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని.. అధికారుల వ్యవహారిస్తున్న తీరుపైన సీరియస్ అయ్యా రు. మార్కెట్‌లో ఖాళీ స్థలం ఉంటే దళారులే అమ్ముకోడానికి అనుమతులు ఇవ్వడం ఏంటని నిలదీశారు.
‘కూరగాయలు, పూల మార్కెట్లలో మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగ్గా లేవు. పార్కింగ్ స్థలం కూడా లేకుండా అక్రమ వ్యాపారులకు అడ్డాగా మారింది. బయో ప్లాంట్ పాడైపోయింది. మార్కెట్ చుట్టూ వుండే ప్రహరీ కూలిపోయింది. మార్కెట్ అంతా మురుగు నీటితో నిండిపోయింది. వచ్చే వారికీ పోయేవారికి సరైన మార్గం కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. వర్షం కాలంలో మార్కెట్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పూల మార్కెట్ పూర్తిగా వ్యాపారుల చేతుల్లోనే ఉంది’ అని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి అక్కడున్న రైతులు వివరించారు.
రైతులు రోడ్లపై అమ్ముకుంటే వ్యాపారాలు మాత్రం మార్కెట్ లోపల మడిగెల్లో అమ్ముకోవడంమేంటీ..? పూల మార్కెట్‌లో కనీస వసతులు ఉండవా..? మార్కెట్ సెక్రెటరీ, అధికారులు, సిబ్బంది కూడా అందుబాటులో ఉండటం లేదు, మార్కెట్ నిర్వహణ రికార్డులు బీరువాలో పెట్టుకొని తాళం వేసుకొని వెళ్లుతా రా అని కోదండరెడ్డి ప్రశ్నించారు. నగరంలో వున్న మార్కెట్‌లన్నీ దళారులకు అడ్డాలుగా మారాయన్నారు. గతంలో బోయిన్‌పల్లి మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి చూసిన కమిషన్.. మార్కెట్‌కు వచ్చే రైతు పరిస్థితి బాగాలేదని, కమీషన్ ఏజెంట్, వ్యాపారి, అధికారులు బాగానే ఉన్నారని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు ఆగమైనాయని, రైతు ప్రయో జనాల కోసం ఏర్పాటు చేసిన మార్కెట్లు లోపభూయిష్టంగా ఉన్నాయని తెలిపారు.