calender_icon.png 12 September, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మెరుగుపడాలి

12-09-2025 07:15:13 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని  ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, సిబ్బందితో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి అంజయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జూనియర్ కళాశాలల పర్ఫామెన్స్ సహా పలు అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని  ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మెరుగుపడాలని ఆదేశించారు. కొన్ని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉందని మెరుగుపరచాలని గట్టిగా చెప్పారు.

అదేవిధంగా అన్ని కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరగాలని సూచించారు. విద్యార్థుల గైర్హాజరు ఎక్కువ లేకుండా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులు, అధ్యాపకుల ఫేషియల్ అటెండెన్స్ కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. గతంలో పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనుల మాదిరిగానే విద్యార్థుల తల్లిదండ్రులచే కమిటీల ద్వారా తీర్మానం చేసి  కళాశాలలో మరమ్మతులు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పనులు ముమ్మరం చేయాలన్నారు. ఇందుకోసం కళాశాలల ప్రిన్సిపల్స్ కమిటీ తీర్మానాలు చేసి ఇంజనీరింగ్ అధికారులకు సమర్పిస్తే వెంటనే పనులు ప్రారంభించి ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఆ దిశగా పనులు వేగవంతం చేసేందుకు ఈడబ్ల్యుఐడీసీ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.