26-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, జూలై 25 ( విజయక్రాంతి) : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే రోగుల వైద్య సంబంధమైన పూర్తి వివరాలు ఒక ఆన్లైన్ లో నిక్షిప్తం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వనపర్తి జిల్లాలో క్షయ, మధుమేహం తదితర వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే రోగులకు సంబంధించిన పూర్తి వైద్య వివరాలు ఆన్లైన్ లో పొందు పరచేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో వనపర్తి మెడికల్ హెల్త్ యాప్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ను తయారు చేయించారు.
ఈ ఆన్లైన్ పోర్టల్ గురించి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వైద్య అధికారులతో పాటు ప్రాథమిక వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ నమోదు పై అవగాహన కల్పించారు. ఇక నుండి రోగుల వివరాలు ఆన్లైన్ యాప్ లో నమోదు చేయాలని, ముందుగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు నిర్వహిస్తున్న హెచ్.బి. ఎ 1(సి) వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ హెల్త్ ప్రొఫైల్ వల్ల రోగి పూర్తి వివరా లు పోర్టల్ లో నమోదు చేయడంతో డాక్టర్ చేసిన వైద్య పరీక్షలు, రిపోర్టులు, ఇచ్చిన మందులు అన్ని పోర్టల్ లో నిక్షిప్తం చేయబడతాయి. ఈ పోర్టల్ ను ఎపుడైనా ఎక్కడైనా పి.హెచ్.సి డాక్టర్ లేదా వ్యాధిగ్రస్తుడు సైతం పోర్టల్ లో లాగిన్ అయి వివరాలు చూసుకోవచ్చు. డాక్టర్ అయితే యూజర్ ఐ.డి, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
వ్యాధిగ్రస్తుడైతే https://wanapart hyhealth.in/ లాగిన్ అయి పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేస్తే రోగి పూర్తి వివరాలు చూసుకోవచ్చు. ఈ పోర్టల్ ద్వారా వ్యాధిగ్రస్తునికి భవిష్యత్ లో వచ్చే రోగాలు, ఇంతకుముందు తీసుకు న్న వైద్య వివరాలు అన్ని పరిశీలిస్తూ మెరుగైన వైద్యం పొందటానికి చాలా అవకాశం కలుగుతుందని తెలిపారు. జిల్లా వైద్య అధికారి డా. శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ఇడియమ్ విజయ్ కుమార్, ఆన్లైన్ ద్వారా అందరూ పి. హెచ్.సి. డాక్టర్లు పాల్గొన్నారు.