calender_icon.png 19 December, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

భవిష్యత్తు నిర్మాణానికి బాటలు!

16-12-2025 12:00:00 AM

రామకిష్టయ్య సంగనభట్ల :

హైదరాబాద్ నగర పురపాలక వ్యవస్థకు భూమిక 1869 సంవత్సరంలోనే పడింది. నిజాం ప్రభుత్వం నగర పరిపాలనను శాస్త్రీయంగా రూపొందించాలనే లక్ష్యంతో అప్పట్లో “హైదరాబాదు మున్సిపల్ కమిటీని ఏర్పాటు చేయగా ఆ తర్వాత బల్దియా అనే పేరుతో ప్రజా చైతన్యంలో నిలిచిపోయింది. ఆ కాలంలో నగరమనేది అఫ్జల్‌గంజ్, హుస్సేనిఆలం, పాతబస్తీ వరకే పరిమితమై ఉండేది. తదనంతరం రోడ్లు, శానిటేషన్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల అవసరం పెరుగుతుండటంతో 1912లో మున్సిపల్ నిర్మాణాన్ని విస్తరించి సమీప ప్రాంతాలకు కూడా పౌరసేవలను చేర్చారు.

1933లో ఆధునిక అవసరాలకు తగ్గట్టు మున్సిపల్ కమిటీ విధానం తీసుకువచ్చి, సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు ద్వారా రోడ్ల నిర్మాణం, మురుగు కాల్వలు, మార్కెట్ యార్డ్‌లు, బస్టాండ్లు, ప్రజా ఆరో గ్య వ్యవస్థ వంటి అంశాల్లో ప్రగతిశీల చర్య లు చేపట్టారు. స్వాతంత్య్రం తరువాత 1955లో హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం అమల్లోకి రావడంతో బల్ది యా పరిపాలన అధికారిక శాసన ఆధారా న్ని పొందింది. 1960 నగ రం దక్షిణ, పశ్చిమ దిశల్లో విస్తరించడం ప్రారంభమై మసాబ్‌ట్యాంక్, మలక్ పేట్, నల్లకుంట, సికింద్రాబాద్ ఉప నగరాలు పట్టణీకరణ ప్రవాహంలో కలిశాయి.

ఈ విస్తరణతో నగర మౌలిక వసతులపై ఒత్తిడి పెరుగుతుండగా, 1990 నుంచి ఐటీ రంగం ఆవిర్భావంతో మరింత ఉన్నత స్థాయికి చేరింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మాదాపూర్, అల్వాల్, ఎల్ బీ నగర్ వంటి ప్రాంతాల అభివృద్ధి వల్ల నగ రం 2000 తరువాత శివార్ల దాకా వ్యాపించి ఒకే నిర్వాహక చట్రంలో పరిపాలన చేయడం కష్టతరమైపోయింది.

పాలన క్లిష్టతరం..

ఈ నేపథ్యంలో 2005లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘గ్రేటర్ హైదరాబాద్’ ఏర్పాటుపై పరిశీలనలు ప్రారంభించింది.అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌ను చుట్టుముట్టి ఉన్న 12 మున్సిపాలిటీలు.. ఎల్బీనగర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, అల్వాల్, పటాన్‌చెరు పట్టణ పరిధితో పాటు శివారు ప్రాంతాలైన 8 గ్రామ పం చాయతీలను 2007 ఏప్రిల్ 16న అధికారికంగా విలీనం చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను ఏర్పాటు చేశారు.

దీంతో నగర విస్తీర్ణం గతం (174) కంటే నాలుగు రెట్లు పెరిగి 625 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం 36 లక్షల జనాభా ఉన్న ఈ పట్టణ ప్రాంతం 2011 నాటికి 68 లక్షలకు పెరిగింది. 2025 అం చనాల ప్రకారం ఈ సంఖ్య 1.05 కోట్లను దాటిందని పట్టణాభివృద్ధి సంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి.

జీహెచ్‌ఎంసీ ఏర్పడిన తర్వాత నగరంలో అభివృద్ధి వేగం పెరిగినా, మునుపటి మున్సిపాలిటీల్లో ఉన్న మౌలిక వసతుల అసమానతలు, పాతబస్తీ వంటి ప్రాచీన ప్రాంతాల్లో ఉన్న మురుగు వ్యవస్థల జీర్ణస్థితి, కొత్తగా విలీనమయిన శివారు బస్తీల్లో ఉన్న అస్తవ్యస్త నిర్మాణాలు వంటి సమస్యలు కార్పొ రేషన్ ముందు నిలిచి ఉన్నాయి.

విలీనం చేసిన ప్రాంతాల్లో రోడ్ల వెడల్పు, నీటి లభ్య త, మురుగు వసతులు, వ్యర్థ నిర్వహణ వ్యవస్థలు ఒకే విధంగా లేని కారణంగా జీహెచ్‌ఎంసీకి సవాల్‌గా మారిపోయింది. దీనికి తోడు నగర జనాభా ప్రతి ఏడాది 3 నుంచి 4శాతం వృద్ధితో ముందుకు సాగుతుండటం జీహెచ్‌ఎంసీ పరిపాలనను మరింత క్లిష్ట తరం చేసింది.

ప్రాంతీయ అసమానతలు..

పరిపాలనను సమర్ధవంతం చేయడానికి జీహెచ్‌ఎంసీలో అంతర్గత పునర్విభ జన అవసరమై, 2007లో సుమారు 100 వార్డుల సంఖ్యను 2016లో 150 వార్డుల కు పెంచారు. ప్రతి వార్డులో సగటు జనా భా 40 వేల నుంచి 55 వేల మధ్యగా ఉం డేలా ఈ పునర్విభజన చేపట్టినా, వేగంగా పెరిగిన శంషాబాద్, ఉప్పల్ శివారు, మియాపూర్, బాచుపల్లి, నార్సింగి, కిస్మత్‌పూర్ వంటి ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య 300 శాతం మేర పెరగడం అసమానత ను మరింత పెంచింది.

ఇదే సమయంలో జీహెచ్‌ఎంసీ బడ్జెట్ 2007లో రూ.3, 500 కోట్ల నుంచి 2024 నాటికి రూ. 8,200 కోట్లకు పెరిగినప్పటికీ, మౌలిక వసతులపై చేసే ఖర్చు 230 శాతం పెరిగి ఆదాయం, వ్యయం మధ్య అసమతుల్యతను సృష్టించింది. కొంతమంది డివిజన్లు పన్నుల రూపంలో కార్పొరేషన్‌కు ఎక్కువ ఆదాయం ఇస్తుండగా, కొన్ని ప్రాంతాలకు అదనపు మౌలిక వసతుల కోసం భారీగా ఖర్చు జరిగింది. ఈ ప్రాంతీయ అసమానతలను సరిచేయడానికి పునర్విభజనకు పరిపాలనా, ఆర్థిక అవసరం ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని 150 డివిజన్ల నుంచి 200 లేదా అం తకంటే ఎక్కువగా పునర్విభజించే ప్రతిపాదనలను పరిశీలించింది. అదే సమయం లో ప్రస్తుతం ఉన్న 34 నిర్వాహక నియోజకవర్గాల సంఖ్యను 44 వరకూ పెంచే అవకాశాలు పరిశీలనలో ఉన్నాయి. పునర్విభజనలో భౌగోళిక సరిహద్దులు, పట్ట ణీకరణ వేగం, రోడ్లు, ట్రాఫిక్, నీటి వినియోగం, తదితర వాటిని ప్రమాణాలుగా పరిగణించనున్నారు.

కొత్త దశలోకి..

ఇలా బల్దియా నుంచి జీహెచ్‌ఎంసీ వర కు జరిపిన పరిపాలనా మార్పులు, నగర వృద్ధిని సమన్వయం చేయడానికి చేపట్టిన పునర్విభజన చర్యలు అన్ని కూడా హైదరాబాద్‌ను సమగ్ర, సుస్థిర, ప్రపంచ స్థాయి మెట్రోపాలిటన్‌గా తీర్చిదిద్దే ప్రయాణంలో కీలక మైలురాళ్లుగా నిలిచాయి. పెరుగుతున్న జనసాంద్రత, వేగవంతమైన వాస్తు, రియల్టీ అభివృద్ధి, ఐటీ, ఐటీఈఎస్ రంగా ల విస్తరణ, ఆరోగ్యం, రవాణా, నీటి అవసరాల పెరుగుదల వంటి అంశాలు పున ర్విభజనను తప్పనిసరి చేస్తున్నాయి.

నగర భవిష్యత్తు వృద్ధి సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న వార్డులు, సముచిత పరిపాలనా అధికారాలు, సిబ్బంది పునర్ని యామకం, బడ్జెట్ పంపిణీ సమన్వయం వంటి చర్యలు పూర్తయ్యే విధంగా ప్రభు త్వం ముందుకు సాగుతోంది. జీహెచ్‌ఎం సీ పునర్విభజన పూర్తయితే నగర పరిపాలన మరింత ప్రజా సన్నిహితంగా మారి పౌరసేవల్లో నాణ్యత పెరిగి పారదర్శకత పెరగనుంది.

మురుగు నీరు, రోడ్లు, తాగునీరు, పన్ను వసూళ్లు, గృహనిర్మాణం సహా అన్ని రంగాల్లో నిర్వహణా సామర్థ్యం పెరగడంతో హైదరాబాద్ ఒక సుస్థిర, సమాన అభివృద్ధి సాధించే మహా నగరం గా ఎదగనుందని నిపుణులు భావిస్తున్నారు. బల్దియా నుంచి గ్రేటర్ హైదరా బాద్ వరకు సాగిన ఈ పరిపాలనా పరిణా మం ఇప్పుడు సమన్యాయ పునర్విభజన రూపంలో కొత్త దశలోకి ప్రవేశించింది. ఇది భవిష్యత్ హైదరాబాద్ నిర్మాణానికి బాటలు వేస్తోంది.

వ్యాసకర్త సెల్: 9440595494