calender_icon.png 20 December, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతోన్మాద చర్య!

16-12-2025 12:00:00 AM

సిడ్నీలోని బోండీ బీచ్‌లో ఆదివారం ఎంతో ఆనందంగా హనుక్కా పండుగను జరుపుకుంటున్న ప్రజల్లో కేవలం యూదులే టార్గెట్‌గా ఇద్దరు ఉన్మాదులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరపడం సం చలనం కలిగించింది. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 16 మంది మరణించగా.. 50 మంది గాయపడ్డారు. భారత్‌లో దీపావళి పండుగ జరుపుకునే విధానంలోనే.. యూదులు కూడా హనుక్కా పండుగను ఎనిమిది రోజుల పాటు అత్యంత పవిత్రంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

తాజా ఘటనలో నల్లని దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బోండీ బీచ్‌లో ఆట పాటల్లో మునిగి తేలిన వారిలో యూదులను టార్గెట్ చేస్తూ కనీసం పది నిమిషాల పాటు 50 రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తులకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్)తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు వాడిన కారులో రెండు ఐసిస్ జెండాలు, ఐఈడీ స్వాధీనం చేసుకున్నారు.

కాగా పోలీసులు పట్టుకున్న వారిలో ఒకరి పేరు నవీద్ అక్రమ్, రెండో వ్యక్తి పేరు సాజిద్ అక్రమ్. ఈ ఇద్దరు తండ్రీ కొడుకులు కావడం మరో విచిత్రమైన విషయం. యూదులపై ఇంతగా ద్వేషం పెంచుకోవడానికి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఈ ఉన్మాదులు ఒక కారణంగా చూపించే అవకాశముంది. కాగా అమాయక ప్రజలపైన కాల్పులు జరపడం మతోన్మాదులకు అలవాటుగా మారిపోయింది. గతంలో అక్టోబర్ 7, 2023న ఇలాగే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా చొరబడి ఒక మ్యూజిక్ ఫెస్టివల్‌లో కాల్పులు జరిపి 1200 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు.

తాజాగా ఇజ్రాయెల్ యుద్ధం పేరుతో పాలస్తీనియన్లను ఊచకోత కోస్తుందనే కారణంతో అమాయకులైన యూదులపై మతోన్మాదులు కాల్పులు జరిపారనిపిస్తున్నది. కానీ ఇజ్రాయెల్‌పై మొదట దాడులు చేసింది హమాస్ ఉగ్రవాదులే అన్న సంగతి అందరికీ తెలిసిందే. 1200 మందిని దారుణంగా చంపడంతో పాటు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాంలోని బైసరన్ లోయలోకి అక్రమంగా చొరబడిన ముష్కరులు టూరిస్టుల్లో హిందువులనే టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపి 26 మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకోవడం మతోన్మాదం ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది. యువతలో పేదరికం, నిరుద్యోగం, రాజకీయ అణచివేత కారణాలుగా ఉన్నప్పటికీ, వీరి దృష్టిని మరల్చడానికి యూదులే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నారని, అన్ని రంగాలు వారి చేతుల్లోనే ఉన్నాయని, అందుకే యూదులు మన శత్రవులని కొందరు మతగురువులు బ్రెయిన్‌వాష్ చేసి వారిని ఉన్మాదులుగా మారుస్తున్నారు.

ఆస్ట్రేలియా జనాభా 2.8 కోట్లు. వీరిలో 1.17 లక్షల మంది యూదులు ఉన్నారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం మొదలైన తర్వాత ఆస్ట్రేలియాలోని యూదులపై దాడులు పెరిగిపోయాయి. ఆస్ట్రేలియాలో 2024-25 ఏడాదిలోనే 1,600 మంది యూదులపై దాడులు జరిగినట్లు అంచనా. గతేడాది కూడా సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాల్లో యూదులే లక్ష్యంగా దాడులు జరిగాయి.

ఆస్ట్రేలియా లో యూదులపై దాడులు క్యాన్సర్ మహమ్మారిలా పెరిగిపోతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఈ విధంగా మతోన్మాద శక్తులు హెచ్చుమీరుతున్న నేపథ్యంలో ఆయా దేశాల్లోని రక్షణ వ్యవస్థలు జాగ్రత్త వహించాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.