08-07-2025 07:08:28 PM
మెగా ఆధార్ క్యాంప్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఆధార్ కార్డులో అవసరమైన వివరాల సవరణలు చేసుకునేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మెగా ఆధార్ క్యాంపును సద్వినియోగపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(District Collector Jitesh V. Patil) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 9, 10 తేదీల్లో కలెక్టర్ కార్యాలయంలో ఈ క్యాంపులు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆధార్ క్యాంపులకు విచ్చేసే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల సందేహాలు, ఆధార్ కార్డుల సవరణకు తగిన సిబ్బందిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.
కావున ప్రజలు ఆధార్ కార్డులో తప్పులున్న వారు, కొత్త సమాచారం జత చేయాలనుకునే వారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ ఆధార్ క్యాంపులో పలు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు . వాటిలో పేరు మార్పు లేదా సవరణ, పుట్టిన తేది సవరణ, లింగం మార్పు, చిరునామా సవరణ, మొబైల్ నంబర్ అప్డేట్, ఫోటో అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్, తల్లిదండ్రుల పేర్లను జోడించడం వంటి సేవలు ఉన్నాయి అని తెలిపారు . ప్రత్యేకంగా 5 , 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు బయోమెట్రిక్ వివరాలు తప్పనిసరిగా నవీకరించాల్సి ఉంటుందన్నారు. అలాగే 0-5 ఏళ్ల పిల్లల ఆధార్‌లో తల్లిదండ్రుల పేర్లను జతచేసే అవకాశం కూడా ఈ క్యాంపులో కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
కొన్ని వివరాలు ఆన్‌లైన్ ద్వారా అప్డేట్ చేయవచ్చు, మరికొన్ని మాత్రం ఆధార్ సేవా కేంద్రం నుంచే చేయాల్సి ఉంటుందని, ఉదాహరణకు, చిరునామా మార్పు ఆన్‌లైన్‌లో సాధ్యపడుతుంది కానీ మొబైల్ నంబర్ లేదా పుట్టిన తేది సవరణ వంటి సేవలు కేవలం ఆధార్ సేవా కేంద్రాల్లోనే చేయాలి. కొన్ని సవరణలకు జీవితంలో ఒక్కసారే అవకాశం ఉంటుందని అయన స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి బృందం ఈ కేంద్రంలో అందుబాటులో ఉన్నందున దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆధార్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కలెక్టర్ తెలిపారు. ఆధార్ డేటాలో ఏవైనా సవరణలు చేయించుకోవాలనుకుంటున్న జిల్లావాసులు తప్పక ఈ మేగా ఆధార్ క్యాంపులను సందర్శించాలని, నవీకరణకు లేదా సవరణకు అవసరమైన పత్రాలను తీసుకువచ్చి తమ వివరాలను నవీకరణ చేసుకోవాలని కలెక్టర్ కోరారు.