08-07-2025 07:01:07 PM
చివ్వేంల: మండల పరిధిలోని చందుపట్ల గ్రామంలో భారత విప్లవోద్యమ రథసారథులు కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వర్ రావు, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి సంస్మరణ సభ ఈనెల 12న అక్కలదేవిగూడెం గ్రామ సమీపంలో గల దేవులపల్లి వెంకటేశ్వర్ రావు స్మారక సమాధి వద్ద నిర్వహించనున్నట్లు యుసిసిఆర్ఐ యంయల్(UCCRI ML) నాయకులు తెలిపారు. విప్లవ అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిస్తూ మంగళవారం చందుపట్ల గ్రామంలో కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెనాగి రెడ్డి ఇద్దరూ జులై నెలలోనే అమరులైనారని తెలిపారు.
ఇద్దరు నాయకులు కూడా తమ రాజకీయ జీవితాన్ని విద్యార్థి దశ నుండే ప్రారంభించారని, నాలుగు దశాబ్దాలకు పైగా అనేక పోరాటాలను నిర్బంధాలను ఎదుర్కొంటూ తమ జీవితం చిట్టచివరి వరకు విప్లవకారులుగా కొనసాగి రహస్య జీవితంలోనే అమరులైనారని తెలియజేసారు. వారి మొక్కవోని దీక్ష ఈనాటి యువతరానికి ఆదర్శప్రాయం కావాలని (యుసిసిఆర్ఐ యం.యల్) పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు దేవులపల్లి వెంకటేశ్వరరావు భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ జిల్లా కార్యదర్శి భాషిపంగు సునీల్, యుసిసిఆర్ఐ యం.యల్ జిల్లా నాయకుడు నల్లగొండ వెంకన్న,మాజీ ఎంపీటీసీ కోడి బండ్లయ్య,ఉప్పల మల్లయ్య,నల్లగొండ లింగయ్య,గోగుల వెంకన్న, అభిమల్ల వెంకన్న, బచ్చలకూరి రాణి,బచ్చలకూర వెంకటేష్, గుద్దేటి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.