07-07-2025 12:47:06 AM
చంద్రశేఖర్‌రెడ్డి వెంచర్‌లో పేలుడు పదార్థాలు?
నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు: కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ ఇందుప్రియ
అరెస్టు వెనక కాంగ్రెస్ బడా నేత హస్తం?
కామారెడ్డి, జూలై 6 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో జిలెటిన్ స్టిక్స్ నిల్వ, సరఫరాల కేసులో పీసీసీ కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి పట్టణంలో జిలెటిన్ స్టిక్స్ సరఫరాలో గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలినట్లు గా సమాచారం. దీంతో శనివారం రాత్రి 10 గంటల సమయంలో తన నివాసంలో చం ద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
రెండురోజుల క్రితం కామారెడ్డి జిల్లా కేం ద్రంలోని కేపీఆర్ కాలనీలోని ఓపెన్ ప్లాట్ లో బండరాళ్లు పేల్చేందుకు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన శ్రీవారి ఎకో టౌన్ షిప్ నుం చి జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు తీసుకువచ్చినట్టు తెలియడంతో శ్రీవారి వెం చర్‌లో ఉన్న పేలుడు పదార్థాలను పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను తన వెంచర్‌లో నిల్వ చేయడంతో పాటు ఇతరులకు సరఫరా చేసిన కేసులో చంద్రశేఖర్ రెడ్డిని అరెస్టు చేసి నిజామాబాద్ జైలుకు తరలించినట్టుగా సమాచారం.
కాగా.. రెండేళ్ల కిందట ఈ వెంచర్‌ను డెవలప్ చేసిన చంద్రశేఖర్‌రెడ్డి ఇతరులకు విక్రయించారు. ప్రస్తు తం అక్కడ ఎలాంటి పేలుళ్లు జరగడంలేదు. అయితే చంద్రశేఖర్ అరెస్టు వెనుక మరో బడా నేత ప్రమేయం ఉన్నదని తెలుస్తోంది. కొద్ది రోజులుగా వీరి మధ్య విభేదాలు రావడమే అరెస్టు వరకు దారితీసిందని సొంత పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
నా భర్తకు సంబంధమే లేదు: ఇందుప్రియ
కామారెడ్డి పట్టణంలో లభించిన పేలుడు పదార్థాలకు, తన భర్తకు ఎలాంటి సంబం ధం లేదని కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. ఆది వారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సంబంధం లేని కేసులో తన భర్త చంద్రశేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని వాపో యారు.
2023 ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయడంతో తమ కష్టానికి గుర్తింపుగా తన భర్తకు పీసీసీ జనరల్ సెక్రెటరీగా అవకాశం ఇచ్చారన్నారు. పదవి వచ్చినప్పటి నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. అయినా తమపై సోషల్ మీడియావేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గడ్డం ఇందుప్రియ ఆరోపించారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారి వివరాలన్నీ తనవద్ద ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు బయటపెడతానని పేర్కొన్నా రు. మూడు రోజుల నుంచి ప్రోబెల్స్ స్కూల్ సమీపంలో దొరికిన పేలుడు పదార్థాలకు, శ్రీవారి వెంచర్‌కు ముడి పెడుతున్నారని, దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని స్ప ష్టం చేశారు. శ్రీవారి వెంచర్‌లో తన భర్తకు గుంట భూమి కూడా లేదని, రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించా రు.
శ్రీవారి వెంచర్‌ను 2023లోనే విభూస్ ఎకో టౌన్ షిప్ వారికి డెవలప్‌మెంట్‌కు లీజ్ అగ్రిమెంట్ చేసి ఇచ్చినట్టు పేర్కొన్నారు. తన భర్తను అరెస్ట్ చేయడానికి ముందు తమకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. బిచ్కుంద పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి 9:30 గంటలకు ఫోన్ రాగానే తన భర్త ఇంటి నుంచి వెళ్లాడని, 11 గంటలకు అరెస్ట్ చేస్తున్నట్లు తనకు ఫోన్ వస్తే వెళ్లానని వెల్లడిం చారు.
తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన భర్తను అరెస్ట్ చేశారని ఇం దుప్రియ తెలిపారు. కామారెడ్డి జిల్లా బిచ్కుం ద పోలీస్ స్టేషన్ వద్ద చంద్రశేఖర్‌రెడ్డిని రిమాండ్ చేశారని వివరించారు.
అక్కడి నుంచి నిజామాబాద్ సారంగపూర్ జైలుకు తరలించారని తెలిపారు.ఈ కేసులో తాము చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. తన భర్త జైలు నుంచి వచ్చాక పూర్తి వివరా లు వెల్లడిస్తామని పేర్కొన్నారు. సమావేశం లో మాజీ కౌన్సిలర్లు పాత శివకృష్ణమూర్తి, జూలూరి సుధాకర్, వంశీకృష్ణ పాల్గొన్నారు.