18-06-2025 02:49:34 PM
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మిట్టపల్లి వెంకటస్వామి
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారును నిలిపివేసి వెంటనే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మిట్టపల్లి వెంకటస్వామి అన్నారు. బెల్లంపల్లి సీపీఐ గంగారం విజ్ఞాన్ భవన్లో బుధవారం మంచిర్యాల జిల్లా సీపీఐ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలనను సాగిస్తున్నదని విమర్శించారు. కగార్ ఆపరేషన్ పేరుతో గిరిజనులను దారుణంగా చంపి వేస్తున్నది అన్నారు. ఖనిజ సంపదకు కాపలాగా ఉన్న గిరిజనులను, వారికి అండగా ఉన్న మావోయిస్టులను మతోన్మాదం మోడీ ప్రభుత్వం ఊచకోత కోస్తున్నదని మండిపడ్డారు.
కగార్ ఆపరేషన్ నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని సమాజం కోరుతుంటే కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. భారతకమ్యూనిస్టు పార్టీ మంచిర్యాల జిల్లా నాలుగో మహాసభ ఈనెల 21, 22 తేదీల్లో జరుగుతొందనీ తెలిపారు. నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో 100 సంవత్సరాలుగా ప్రజల మౌలిక, కార్మికుల హక్కులకోసం ఉద్యమిస్తున్నది అన్నారు. భూమి లేని పేదలకు భూములు పంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు నిర్వహించదని పేర్కొన్నారు. ఈ క్రమంలో అనేకమంది కామ్రేడ్స్ ను కోల్పోయి, అలుపెరుగని పోరాటాలు నిర్వహించినదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈనెల 21, 22 తేదీలలో మంచిరాల్లో జరుగు సిపిఐ మంచిర్యాల జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ, పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి, పట్టణ బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, బి కే ఎం యు జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండు బానేష్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, పట్టణ నాయకులు గుండా ప్రశాంత్, అంబాల ప్రభుదాసు పాల్గొన్నారు.