పేటలో ప్రైవేట్ ఉపాధ్యాయుల శాంతియుత నిరసన ర్యాలీ
సూర్యాపేట, ఆగస్టు 21 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామంలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకు గురి కావడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలుగాలని కోరుతూ యునైటెడ్ ట్రస్మా, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో శుక్రవారం ఉపాద్యాయులు, పలు పాఠశాలల ప్రిన్సిపల్స్, కరస్పాండెంట్లు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుదని అలాంటి గురువును దారుణంగా హత్య చేయడం దారుణమన్నారు. ఏ గురువైనా విద్యార్ధులను మంచిగా ఉండమని చెబుతారు తప్ప చెడిపోమ్మని కాదన్నారు. తమ నుంచి విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు గంజాయికి బానిసై, మాదకద్రవ్యాలకు అలవాటు పడి చెడు ప్రవర్తనతో ఉంటే మందలించడం రూపారెడ్డి తప్పా అని ప్రశ్నించారు. స్వాతంత్య్ర భారతదేశంలో టీచర్లకు రక్షణ, కఠిన చట్టాలు లేక పోవడం దారుణమన్నారు.
ప్రభుత్వాలు స్పందించి నవతరాన్ని తయారు చేసే ఉపాధ్యాయులకు రక్షణ కల్పించడంతో పాటు వారి కోసం కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ట్రస్మా ప్రతినిధులు త్రివేణి హరి, ఆర్.ప్రకాష్ రెడ్డి, పగడాల ఉపేందర్ రెడ్డి, రామసాని శ్రీనివాసనాయుడు, ఖమ్మంపాటి భిక్షపతి, గాలి రమేష్, మారం లింగారెడ్డి, వెంపటి అజయ్ కుమార్, తీగల ఉపేందర్రావు, టీపీటిఎల్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరసింహరావు, గౌరవాధ్యక్షులు సోమరాజు, ఉపాధ్యక్షులు బాలక్రిష్ణ, రాజశేఖర్ లతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.






