12-08-2024 12:00:00 AM
పోలీసుల అదుపులో యూట్యూబర్
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు11(విజయక్రాంతి): యూట్యూబ్‌లో వైరల్ అయ్యేందుకు ఓ యూట్యూబర్ నెమలి కూర వండుతున్నట్లు పెట్టిన వీడియో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాకు చెందిన ప్రణయ్‌కుమార్ అనే యూట్యూబర్ వంటలు వండుతూ యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటాడు. జాతీయ పక్షి నెమలికూర ఎలా వండాలో తన ఛానల్‌లో వీడియో తీసి పెట్టడంతో పలువురు నెటిజన్లు, జంతుప్రేమికుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఆ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించాడు.
ఎఫ్‌ఆర్వో ఆర్ కల్పనాదేవి ఆధ్వర్యంలో ఆదివారం అటవీశాఖ అధికారులు తంగళ్లపల్లిలోని అతడి ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. అతడు వండిన కూరను పరిశీలించగా చికెన్ కనిపించింది. వంట చేసిన పరిసరాల్లో కోడి చర్మం, ఈకలు గుర్తించారు. అనంతరం వివరాలను వెల్లడించారు. యూట్యూబర్ వండింది కోడికూర అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు. పూర్తి పరిశీలన కోసం యూట్యూబర్ వండిన వంటకాన్ని ప్రయోగశాలకు పంపిస్తున్నట్లు ప్రకటించారు. అతడిపై కేసు నమోదుచేసి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.