27-01-2026 07:20:16 PM
మల్లాపూర్,(విజయక్రాంతి): విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించుకునేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని జిల్లా తనిఖీ బృందం నోడల్ ఆఫీసర్ కొమ్మిడి లక్ష్మన్న సూచించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాతారంలో విద్యార్థుల సామర్థ్యాలను జిల్లా ప్యానల్ తనిఖీ బృందం మంగళవారం పరిశీలించింది. పాఠశాలలొని మౌలిక వసతులు విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాల రికార్డుల నిర్వహణ మార్కుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం తదితర అంశాలను పరిశీలించారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కొమ్మిడి లక్ష్మన్న మాట్లాడుతూ విద్యార్థులు అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నందున ప్రత్యేకత తరగతుల నిర్వహిస్తూ స్లిప్ టెస్ట్ ద్వారా వారి సామర్థ్యాన్ని అంచనా వేసి ఫలితాల ఆధారంగా గ్రూపులుగా విభజించాలని పేర్కొన్నారు. విద్యార్థుల సామర్థ్యాల పెరుగుదలకు ప్రత్యేక చొరవ తీసుకొని ఉపాధ్యాయులు వారిని చదివించాలని చెప్పారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.